మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక.. ఏం జరిగిందంటే?
ఏపీలోని కర్నూలులో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ 14 ఏళ్ల బాలికపై అకృత్యం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరు శివారు గ్రామానికి చెందిన ఓ బాలిక రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్తోంది. ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర ఆ బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ తెలుగు శివకుమార్‌తో కలిసి వేధింపులకు గురిచేశాడు.
విషయం బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించడంతో, భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ ఇద్దరు మృగాలు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో, ఆమె తల్లిదండ్రులు ఈ నెల 28న కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్లారు.
అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని తేలింది. అదే రోజు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక ప్రసవించడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు, నవజాత శిశువు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల సంరక్షణలో ఉన్నారు.
