టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్
తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సామాజిక సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్, తిరుమలకు వచ్చే భక్తులకు కాలుష్య రహిత, మరింత స్థిరమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా 25 ఎలక్ట్రిక్ బస్సులు, ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని అందజేసింది. తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రానికి రానున్న తరుణంలో ఈ బస్సులు అందుబాటులోకి రావడం విశేషం. జూన్ 2026లో తిరుమల పర్యటన సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ ఇచ్చిన హామీని ఇది నెరవేర్చింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేస్తామని ఆయన ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ కలిసి పనిచేశాయి.
ఈ 25 ఎలక్ట్రిక్ బస్సుల చేరిక టీటీడీ చేపట్టిన పర్యావరణహిత రవాణా (గ్రీన్ మొబిలిటీ) విధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది సంప్రదాయ ఇంధన వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, ఏటా తిరుమలను సందర్శించే లక్షలాది మంది భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాన్ని అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ కార్యక్రమం రిలయన్స్ ఫౌండేషన్, జియో-బిపి (Jio-bp) ఉమ్మడి కృషితో సాధ్యమైంది. రిలయన్స్ ఫౌండేషన్ దాతృత్వ సహాయాన్ని అందించగా, జియో-బిపి ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనలో తన నైపుణ్యాన్ని అందించింది.
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ మాట్లాడుతూ, “శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏటా లక్షలాది మంది భక్తులు పవిత్ర తిరుమలకు వస్తుంటారు. వారి ప్రయాణానికి తోడ్పడటం మాకు లభించిన గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నాం. ఈ ప్రాంతంలోని గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుతూనే, తిరుమల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు టీటీడీ చేస్తున్న ప్రయత్నాలకు ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులు మేము అందించే చిరు తోడ్పాటు” అని పేర్కొన్నారు.
భారతదేశ వ్యాప్తంగా సుస్థిర అభివృద్ధిని సాధించడంతో పాటు స్వచ్ఛమైన రవాణా పరిష్కారాలను ప్రోత్సహించాలనే రిలయన్స్ విస్తృత లక్ష్యంలో ఈ కార్యక్రమం ఒక భాగం.
