డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్
డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జరిగినట్లుగా ఆరోపించబడుతున్న కుంభకోణానికి బాధ్యత వహిస్తారా అని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
న్యాయమైన అవకాశం కోసం లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితంలోని అత్యంత విలువైన ఏళ్లను, తమ కుటుంబాల కష్టార్జితాన్ని వెచ్చిస్తారని జగన్ గుర్తు చేశారు. వ్యవస్థ వారిని నిరాశపరిచినప్పుడు, అది కేవలం ఫలితాలపైనే ప్రభావం చూపదు. నియామక ప్రక్రియపై వారికున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిలో తీవ్ర నిరాశను మిగుల్చుతుందని.. జగన్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారూ, పారదర్శకత లేదా న్యాయబద్ధత అనేది కేవలం ఒక ఎంపిక కాదు, అది ఒక బాధ్యత! వారి కష్టానికి తగిన న్యాయం, భవిష్యత్తులో జవాబుదారీతనం అవసరమని మీకు అనిపించడం లేదా.. అంటూ జగన్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిందని, అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్ అనవసర రాద్ధాం తం చేస్తున్నారని, డీఎస్సీపై చర్చకు ఆయన సిద్ధమా అని టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ సవాల్ విసిరారు.
