Reliance Foundation: ఎఫ్ఐసీసీఐ స్పోర్ట్స్-హై పెర్ఫార్మెన్స్ అవార్డును సొంతం చేసుకున్న రిలయన్స్ ఫౌండేషన్
ఎఫ్ఐసీసీఐ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో రిలయన్స్ ఫౌండేషన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ క్రమంలో ఎఫ్ఐసీసీఐ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో రిలయన్స్ ఫౌండేషన్ ఉత్తమ కార్పొరేట్ ప్రమోటింగ్ స్పోర్ట్స్-హై పెర్ఫార్మెన్స్ అవార్డును సొంతం చేసుకుంది.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అండ్ చైర్‌పర్సన్ శ్రీమతి నీతా అంబానీ దార్శనిక నాయకత్వంలో, రిలయన్స్ ఫౌండేషన్‌కు మంగళవారం ఎఫ్ఐసీసీఐ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ కార్పొరేట్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ - హై పెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశ క్రీడాకారుల కలల సాకారం కోసం పూర్తి మద్దతివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే దశాబ్దం భారతీయ క్రీడకు స్వర్ణ యుగం అవుతుందని పేర్కొన్నారు. భారత క్రీడాకారుల కలలు నిజమయ్యేందుకు తమ ఫౌండేషన్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని నీతా అంబానీ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్‌లు, ఎఫ్ఐసీసీఐ వంటి సంస్థలు, మన యువ అథ్లెట్లు, వారి కుటుంబాలతో కలిసి భారతదేశాన్ని నిజంగా ప్రపంచ బహుళ-క్రీడా శక్తి కేంద్రంగా మార్చాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు.
ఇదంతా పతకాల వేట కోసం కాదని.. క్రీడా విభాగంలో విజయాలు సాధించడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడంలో పాలు పంచుకోవడం అవుతుందని నీతా అంబానీ పేర్కొన్నారు.