మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (16:36 IST)

ఎస్ఈసీగా నిమ్మగడ్డ... మంచి నిర్ణయమంటూ చంద్రబాబు ప్రశంసలు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశారు. నిమ్మగడ్డ అంశంలో గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం స్పందిస్తూ, 'రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. తద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకం. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పడింది' అని చెప్పారు.
 
'కరోనా వ్యాప్తి వేళ ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహం' అని చంద్రబాబు అన్నారు.
 
'ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. ఎస్ఈసీ తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షిక విధి నిర్వహణకు దోహదపడాలి. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలి' అని చంద్రబాబు ట్వీట్లు చేశారు. 
 
మాస్క్ పెట్టుకోకపోతే కొట్టి చంపేస్తారా? 
కరోనాకు చికిత్స తీసుకోవడం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'విజయ సాయి రెడ్డి గారూ.. కరోనా చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మీరు ఉంటే, సీబీఐ అధికారులు మిమ్ములను విచారణ చేసే అవకాశం వుంటుందా? విచారణ తప్పించుకోడానికి ఆసుపత్రి డ్రామా అని మీ సన్నిహితులు అంటున్నారు. ఏది నిజం, ఏది వైరల్? ఈ ఒక్క నిజం మీ నోట వినాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు' అని టీడీపీ నేత వర్ల రామయ్య ట్వీట్లు చేశారు.
 
కాగా, ఒక దళిత యువకుడిపై చీరాల పోలీసులు ప్రవర్తించిన తీరుపై వర్ల రామయ్య స్పందిస్తూ... 'మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చీరాల పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడితే, అతను చనిపోయాడు. మాస్క్ పెట్టుకోకపోతే చచ్చేంత కొడతారా? మరి మన రాష్ట్రంలో చాలా మంది "పెద్దలు" మాస్క్ పెట్టుకోకుండా "పరిపాలన" చేస్తున్నారు, వారిని ఏమి చేస్తారు? లాఠీలకు పని చెపుతారా, జీ హుజూర్ అంటారా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.