1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. అటవీ అందాలు
  4. Skip Strong Perfumes, Noise To Avoid Bee Attacks In Ajanta Caves: Official

అజంతా గుహల సందర్శనకు వెళ్తున్నారా? బిగ్గర మాట్లాడకూడదు.. అలాంటి Perfumes..?

Ajanta Caves
Ajanta Caves
మహారాష్ట్రలోని ప్రపంచ ప్రసిద్ధ అజంతా గుహల సమీపంలో వరుసగా తేనెటీగల దాడులు సంభవించిన నేపథ్యంలో, ఆ కీటకాలను తరిమికొట్టే విధంగా బిగ్గర శబ్ధాలకు, ఘాటైన పరిమళ ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అటవీ శాఖ సందర్శకులకు విజ్ఞప్తి చేసింది. 
 
అంతేకాకుండా, ఈ విషయమై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని అజంతా గుహల ప్రాంతంలో, 1 నుండి 26 వరకు ఉన్న గుహలను కలుపుకొని అటవీ శాఖ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఇందులో మూడు తేనెతుట్టెల గురించి అటవీశాఖ వివరాలను పేర్కొంది. 
 
వీటిలో ఒకటి 26వ గుహ సమీపంలో, మరొక రెండు 10వ గుహ సమీపంలో గుర్తించబడ్డాయి. ఈ తేనెతుట్టెలు మరింత విస్తరించకుండా నిరోధించడానికి, అలాగే తేనెటీగలు అక్కడి నుండి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) స్థానిక ప్రతినిధులను కోరినట్లు ఒక అటవీ శాఖ అధికారి సోమవారం తెలిపారు. 
 
ఇటీవల ఈ గుహల సముదాయం సమీపంలో పర్యాటకులపై తేనెటీగల దాడులకు సంబంధించిన పలు ఘటనలు చోటుచేసుకోవడంతో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అటవీ శాఖ తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
 
ఇందులో భాగంగా సందర్శకులు గాఢమైన సువాసనలు వెదజల్లే పరిమళ ద్రవ్యాలను  వాడకూడదని సూచించడం జరిగింది. ఎందుకంటే ఇవి తేనెటీగలను ఆకర్షిస్తాయి. అలాగే, వారు బిగ్గరగా మాట్లాడకుండా ఉండటం కూడా మంచిది. ఈ సందేశాన్ని అందరికీ చేరవేసేందుకు, రాబోయే ఒకటి రెండు రోజుల్లో గుహల ప్రాంగణంలో బ్యానర్లను ఏర్పాటు చేస్తామని ఆ అధికారి తెలిపారు. 
 
తాము కొన్ని నిర్దిష్ట సూచనలతో ఏఎస్ఐ కార్యాలయానికి లేఖ కూడా రాయబోతున్నామని.. భవిష్యత్తులో తేనెటీగల దాడులు జరగకుండా నివారించేందుకు అవసరమైన చర్యలను వారు అమలు చేస్తారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అజంతా గుహలు 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి.
About Writer
సెల్వి