సంబంధిత వార్తలు
- కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...
- ఆగస్టు 15న ఏపీ జాబ్ క్యాలెండర్, 3,168 పోస్టులు భర్తీకి రంగం సిద్ధం
- 14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం
- Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్
- వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు
క్రెడిట్ కార్డుతో ప్రీమియం చెల్లింపులను నిలిపివేసిన ఎల్.ఐ.సి
ప్రముఖ ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్.ఐ.సి) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి క్రెడిట్ కార్డుతో ప్రీమియం చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తన అధికారిక కస్టమర్ పోర్టల్, యాప్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను తొలగించింది. 15 రోజుల క్రితమే ఈ ఆప్షన్‌ను తీసేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఆప్షన్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియంలను ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించేటప్పుడు రుసుములు పడేవి. అదే ఎల్‌ఐసీ పోర్టల్ / యాప్‌లో క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లించినప్పుడు గేట్‌వే ఛార్జీలను / కన్వీనియన్స్ ఫీజులను కస్టమర్లు తరఫున ఎల్‌ఐసీనే భరించేది. రానురాను లావాదేవీల సంఖ్య పెరుగుతుండడం, ఫీజుల భారం అధికం అవుతుండడంతో క్రెడిట్‌కార్డ్ ఆప్షన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ క్రెడిట్‌కార్డు ఉపయోగించి బిల్లు పేమెంట్ చేయాలంటే భారత్ బిల్ పేమెంట్‌పే, దాంతో అనుసంధానమైన బిల్లు పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని ఎల్‌ఐసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంటే గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా ప్రీమియం చెల్లింపులకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో రుసుముల భారాన్ని వినియోగదారులే భరించాలి.
ఒకవేళ ఎలాంటి రుసుములూ లేకుండా ఉచితంగా ప్రీమియం చెల్లించాలనుకుంటే ఎల్‌ఐసీ అధికారిక పోర్టల్‌లో UPI, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. యాక్సిస్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కో బ్రాండెడ్ క్రెడిట్‌కార్డులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఇతర ప్లాట్‌ఫామ్‌లపై ప్రీమియం చెల్లించినప్పటికీ రివార్డు పాయింట్లు మాత్రం లభిస్తాయి. దీంతో ఇక కోబ్రాండ్ క్రెడిట్ కార్డులతో ప్రయోజనమేంటని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
