ఆ బాలిక శీలం ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు
ఏపీలోని కడప జిల్లా చెన్నూరులో ఓ దారుణం జరిగింది. బాలిక శీలానికి గ్రామ పెద్దలంతా కలిసి లక్ష రూపాయలు వెలకట్టి, ఆ బాలికపై లైంగికదాడికి తెగబడిన నిందితుడుని వదిలిపెట్టేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కడపకు చెందిన ఓ వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగి. ఆ గ్రామానికి తరచూ వస్తుంటాడు. సదరు బాలిక కుటుంబ యజమాని ఇటీవల మృతి చెందడాన్ని ఆసరాగా చేసుకొని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు.
బాలిక తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో బాలిక కుటుంబానికి రూ.లక్ష ఇప్పించేలా పెద్ద మనుషులు ఒప్పందం కుదిర్చి చేతులు దులుపుకొన్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మద్యం సేవించి వాహనం నడిపితే కాలేజీలకు సమాచారం... 270 మందికి జైలుశిక్ష
మద్యం తాగి వాహనం నడిపే విద్యార్థులపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ సమాచారాన్ని వారు చదువుకునే కాలేజీలకు చేరవేయనున్నారు.
ఇప్పటికే డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన 270 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, శిక్ష పడిన వారి వివరాలతో వారి కార్యాలయాలకు, విద్యా సంస్థలకు లేఖలు పంపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ చర్య ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం, నేరం రుజువు కావడంతో 270 మందికి జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిక్ష పడిన వారు పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న సంస్థలకు వారి వివరాలతో లేఖలు పంపిస్తున్నాం. వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం' అని వివరించారు.
నగరంలో రోడ్డు భద్రతను పెంచడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతాయని హెచ్చరించారు. తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని, పట్టుబడితే కఠిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.