మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్
శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యం కావడం ఇపుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హెచ్.టి.హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ వీరేశ్ కుటుంబంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వీరేశ్ తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు రోహణి, రచనలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, వీరేశ్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది.
ఈ క్రమంలో గత ఫిబ్రవరి నెల 27వ తేదీన దంపతుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. భర్త వేధింపులు భరించలేకపోయారో లేక మరేదైనా కారణమో కానీ అదే రోజు రాత్రి తల్లి సుబ్బమ్మతో కలిసి లక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
రెండు రోజులుగా చుట్టుపక్కల ప్రాంతంలో గాలించిన బంధువులు ఈ నెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఆచూకీ కనుగొనేందుకు విచారణ జరుపుతున్నారు. భార్యాపిల్లలు అదృశ్యమైనప్పటి నుంచి వీరేశ్ కూడా పరారీలో ఉండటం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తోంది.