సంబంధిత వార్తలు
- తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు
- డెంగీ జ్వరంతో చనిపోయిన భార్య - ఆమె చివరి కోరిక తీర్చిన భర్త..
- టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు
- సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటున్న టీవీకె ఎమ్మెల్యే ముస్తఫా, ఇప్పుడు టెంపుల్ స్టేట్ హిందువుల మనోగతం ఏమిటో?
- ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)
ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాలతో పాటు వీడీ సతీశన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఉత్కంఠత మధ్య కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను ఏఐసీసీ అధిష్టానం ఎంపికచేసింది.
గత నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాల్లో పోటీపడిన ఈ కూటమి 102 చోట్ల విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉండటంతో సతీశన్ ఎంపికకు అధిష్టానం పది రోజుల సమయం తీసుకోవడం గమనార్హం.
కొచ్చికి సమీపంలోని నెట్టూర్‌లో 1964లో వీడీ సతీశన్ జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన.. సామాజిక కార్యకర్తగానూ పేరొందారు. కేరళ విద్యార్థి విభాగంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత యూత్ కాంగ్రెస్‌లో చేరి, పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. మంచి వక్తగానూ గుర్తింపు వచ్చింది. తర్వాత కాంగ్రెస్‌లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రజానేతగా, ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా సంస్కరణాభిలాషిగా ఎదిగారు.
2001లో పరావుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి, వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. 2021లో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలుపొందగా.. యూడీఎఫ్ విపక్షానికే పరిమితమైంది. కానీ ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. పాలనాపరంగా ఎలాంటి అనుభవం లేని సతీశన్‌ను ప్రతిపక్ష నేతగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో పలువురు అనుమానం వ్యక్తంచేశారు. కానీ ఎల్‌డీఎఫ్‌ను ఎదుర్కొనే నేతగా తనను తాను నిరూపించుకున్నారు.
అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరాజయాలతో సతమతమవుతుంటే.. రాష్ట్రంలో మాత్రం హస్తం పార్టీ శ్రేణుల్లో ఆయన ఉత్సాహం నింపారని రాజకీయ విమర్శకులే అంగీకరించిన సందర్భాలున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన.. విజయన్‌కు ప్రధాన పోటీదారుగా తనను తాను నిరూపించుకున్నారు. క్షేత్రస్థాయిలోకి బలంగా చొచ్చుకెళ్లారు.
అందుకే సీఎం ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం వెల్లడైంది. పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ నాయకత్వం వైపు మొగ్గు చూపగా, ప్రజల్లో మటుకు సతీశన్ పేరు ఎక్కువగా వినిపించింది. దాంతో ప్రజాభిప్రాయం వైపే మొగ్గు చూపిన అధిష్ఠానం చివరకు ఆయన్నే సీఎం పదవికి ఎంపిక చేయాల్సివచ్చింది.
