స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు శుక్రవారం స్తంభించాయి. ఈ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ దేశాల్లోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. ఈ సమస్య వల్ల మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్ సహా ఇతర మైక్రోసాఫ్ట్ అప్లికేషన్‌లలో అంతరాయం చోటుచేసుకుంది.
ఈ సేవల అంతరాయం వల్ల వేలాది మంది వినియోగదారులు వెబ్, డెస్క్‌టాప్ అప్లికేషన్‌లు, మొబైల్ కనెక్షన్‌ల ద్వారా అవుట్‌లుక్‌లో తమ మెయిల్‌బాక్స్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెయిల్ డెలివరీ కూడా ఆలస్యమైంది. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అవుట్ లుక్ సమస్యలపై దాదాపు లక్షకు పైగా ఫిర్యాదులు అందినట్లు డౌన్‌డిటెక్టర్ తెలిపింది. ఉదయం 4.30 గంటలకల్లా ఫిర్యాదులు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. ప్రభావిత సర్వర్లను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రమంగా తమ సేవలు మెరుగవుతున్నాయని పేర్కొంది. ప్రభావిత సర్వర్లలో సురక్షిత కనెక్షన్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియే ఈ అంతరాయానికి కీలక కారణమని తమ దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించింది. ఆ ప్రక్రియ వల్ల సర్వర్లపై అధిక భారం పడడంతో అవి కొంతసేపు మొరాయించినట్లు తెలిపింది.
ఈ అంతరాయం వల్ల ప్రభావితమైన సేవల్లో మైక్రోసాఫ్ట్ ప్లానర్, టుడూ, డిఫెండర్, పర్‌వ్యూ, గ్రాఫ్, ఫ్యాబ్రిక్, పవర్ బిఐ, షేర్‌పాయింట్ ఆన్‌లైన్, యూనివర్సల్ ప్రింట్ విండోస్ 365 వంటివి ఉన్నట్లు స్పష్టం చేసింది.

