రాముడు కంటే సీతాదేవి గొప్పది : సీఎం డీకే శివకుమార్
రామాయణంపై కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాముడు కంటే సీతాదేవి గొప్పదన్నారు. ఆమె చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు మహిళకు స్ఫూర్తిదాయకమని అన్నారు. బుధవారం బెంగళూరులో మహిళా పారిశ్రామికవేత్తల సంఘం నిర్వహించిన 'టుగెదర్ వియ్ గ్రో' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ఆయన ఉదాహరణగా చూపారు. ఇందిరా గాంధీ మరణం, భర్త రాజీవ్ గాంధీ హత్య వంటి ఎన్నో విషాదాలను ఎదుర్కొని ఆమె పార్టీని నడిపించారని గుర్తుచేశారు. రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌కు ఆ పదవిని ఇచ్చారని, ఇది మహిళల త్యాగనిరతికి నిదర్శనమని చెప్పారు. సవాళ్లను అధిగమించి వ్యాపారాలు నిర్మించిన మహిళా పారిశ్రామికవేత్తలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వం అవసరమని డీకే శివకుమార్ అన్నారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, ఇందులోభాగంగానే ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 'శక్తి' పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 'గృహలక్ష్మి' పథకం కింద 1.22 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2,000 అందిస్తున్నామని వివరించారు.
