గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : మంగళవారం, 5 జనవరి 2016 (16:54 IST)

రాముడిని వాలి నిందించుట: చాటుగా నిలిచి రాముడు వాలిని ఎందుకు చంపినట్లు...?

సుగ్రీవుని కోరిక మేరకు రాముడు వాలిని బాణముతో కొట్టగా, యుద్ధములో కఠినుడై వాలి, నరికివేసిన చెట్టువలె నేలమీద పడిపోయెను. పరిశుద్ధమైన బంగారు అలంకారములు ధరించిన ఆ వాలి కట్టిన త్రాళ్ళు విప్పివేయగా నేలమీద పడిపోయిన ఇంద్రధ్వజమువలె, సమస్త అవయమవములు నేలపై అనునట్లు పడిపోయెను.

వానర గణములకు ప్రభువైన ఆ వాలి పడిపోవుటతో భూమి, చంద్రుడు తొలగిన ఆకాశమువలె ప్రకాశవిహీనమయ్యను. వాలి నేలమీద పడిపోయినా శోభకాని, ప్రాణములు కాని, తేజస్సుకాని, పరాక్రమము కాని అతనిని విడువలేదు. దేవేంద్రుడికిచ్చిన రత్నములచేత అలంకరింపబడిన ఆ శ్రేష్ఠమైన బంగారుమాల వాలి ప్రాణములను, తేజస్సును, శోభను నిలబెట్టెను. 
 
ఆ విధముగా యుద్ధములో పడిపోయి, బంగారుమాల ధరించిన మహేంద్రుపుత్రుడైన వాలి, జ్వాలలు శాంతించిన అగ్నివలె, ప్రళయ కాలమునందు కాలునిచే క్రిందపడవేయబడిన సూర్యుడు వలె ఉండును విశాలమైన వక్షఃస్థలము, దీర్ఘములైన బాహువులు, ప్రకాశించుచున్న ముఖము, పచ్చనినేత్రములు గల ఆ వాలి మహేంద్రుడు వలె ఎదిరింప శక్యముకాని వాడు, ఉపేంద్రుడు వలె సహింప శక్యము కానివాడు. అట్టి వాలి పడిపోయినట్లు చూసి రాముడు లక్ష్మణ సహితుడై అతని దగ్గరకు వెళ్లెను. 
 
  రామలక్ష్మణులు మెల్లగా చూచుచున్న వీరుడైన ఆ వాలివద్దకు గౌరవ పురస్సరముగా వెళ్లిరి. బాణము దెబ్బతిని కొంచెము మిగిలిన ప్రాణముతోను తేజస్సుతోను నేలమీదపడిపోయి, స్పృహ కోల్పోయిన ఆ వాలి రాముని, లక్ష్మణుని చూచి అర్థముతో కూడిన మాటలతో, వినయ సంపన్నము, ధర్మసమ్మతము అయిన వాక్యమును సగర్వముగా పలికెను. 
 
  "మరొకరితో యుద్ధము చేసే తొందరలో ఉన్న నేను నీ మూలమున మరణించుచున్నాను గదా! నీ వైపు తిరిగి లేనివానిని చంపి నీవు ఏ గుణమును సాధించినావు? 
 
 రాముడు సత్కులమునందు పుట్టినవాడు. బలశాలి. తేజస్సు కలవాడు. నియమములను ఆచరించువాడు. కరుణ కలవాడు, ప్రజల హితమునందే ఆసక్తి కలవాడు. జాలి కలవాడు. మంచి ఉత్సాహము కలవాడు. సమయాసమయములు తెలిసినవాడు. నియమముల విషయమున స్థైర్యముగలవాడు అని సకలభూతములు భూలోకములో నీ కీర్తిని చెప్పుకొనుచుందురు కదా!
   
రాజా ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకొనుట, ఓరిమి, ధర్మము, ధైర్యము, బలము, పరాక్రమము, అపకారము చేసిన వారిని దండించుట - ఇవి రాజుల గుణములు నీయందు ఆ గుణములు ఉన్నవని అనుకుని, శ్రీ శ్రేష్ఠమైన వంశమును కూడా చేసి, నేను తార నివారించుచున్ననూ వచ్చి సుగ్రీవునితో యుద్ధము చేయుచు ఏమరుపాటు చెంది ఉన్న నన్ను కొట్టావు'' అని నేను అనుకున్నాను. 
 
నీ బుద్ధి చాలా చెడ్డదనీ, నీవు ధర్మమనే ధ్వజమును ధరించిన అధార్మికుడవనీ, పాపప్రవృత్తి కలవాడవనీ, గడ్డి కప్పిన నుయ్యువంటి వాడవనీ నాకు తెలియదు. నీవు సత్పురుషుల వేషము ధరించిన పాపాత్ముడవనీ, కప్పబడివున్న నిప్పువంటివాడవనీ, ధర్మమనే ముసుగులో ఉన్నవాడవనీ నేను గ్రహించజాలకపోయినాను.
 
నేను నీ దేశములో కాని, నీ పురములో గానీ ఏ పాపకార్యము చేయలేదు. నిన్ను అవమానించలేదు. నిత్యము ఫలమూలాలను భుజించుచు వనములో నివసించే వానరుడను. పాపము లేనివాడను. నీతో యుద్ధము చేయుటలేదు. మరొకనితో యుద్ధము చేయుచున్నాను. అట్టి నన్ను ఎందుకు చంపుచున్నావు. 
 
నీవు చూచుటకు ఆనందమును కలిగించు రాజకుమారుడవుగా ప్రసిద్ధుడవు. నీయందు ధర్మసమ్మతములైన జటావల్కలాది చిహ్నములు కూడా స్పష్టముగా చూపబడుచున్నవి. క్షత్రియవంశములో జనించి శాస్త్రాభ్యాసము చేసి, సంశయములన్నీ తొలగించుకుని, ధర్మచిహ్నములను ధరించిన ఎవడైనా ఇట్టి క్రూరమైన పని చేయునా.? రఘువంశంలో పుట్టి, ధర్మాత్ముడుగా ప్రసిద్ధిచెందిన నీవు వాస్తవమున దుష్టుడవై ఉండి కూడా మంచివాడనని చెప్పుకొనుచు ఎందుకు తిరుగుచున్నావు?
 
 సామము, దానము, ఓర్పు, ధర్మము, సత్యము, ధైర్యము, పరాక్రమము, అపకారము చేసినవారిని దండించుట - ఇవి రాజగుణములు. మేము, పండ్లు దుంపలు తిని వనములో నివసించే మృగములము. ఇది మా స్వభావము. నీవో నరులకు అధిపతియైన పురుషుడవు. ఎవరినైనా నిగ్రహించుటకై భూమి, బంగారం, వెండి కారణములు. అట్టి స్థితిలో, నీకు నా భూమియైన వనము మీద కాని, నేను తినే ఫలముల మీదగాని ఆశ ఏమిటి? నీతిని అవలంబించుట, వినయము కలిగి ఉండుట. నిగ్రహించతగినవారిని నిగ్రహించుట, అనుగ్రహించ తగిన వారిని అనుగ్రహించుట- ఇది రాజు పాటించవలసిన ధర్మము. వీటిలోసాంకర్యమునకు, ఒకదానిలో మరొకటి కలిసిపోవుటకు అవకాశము లేదు. అందుచే రాజులు స్వేచ్ఛగా ప్రవర్తించరు. 
 
కానీ నీకు కామమే (నీ కోరిక తీరుటమే) ప్రధానము. నీవు కోప స్వభావుడవు. చంచలమైన మనస్సు కలవాడవు. రాజధర్మముల విషయమున నిశ్చితబుద్ధి లేనివాడవు. ధనుస్సు చేతిలో ఉన్నది కదా అని ఇతరులను చంపుచుందువు. నీకు ధర్మమునందు శ్రద్ధలేదు. నీ బుద్ధికి అర్థము విషయమునందు స్థైర్యము లేదు. స్వేచ్ఛగా కామమునకే ప్రాధానమయ్యే నిన్ను ఇంద్రియములు ఇటు అటు లాగివేయుచున్నవి.

ఏ అపరాధమూ లేని నన్ను బాణముతో చంపి, ఇట్టి నింద్యమైన పని చేసిన నీవు సత్పురుషుల మధ్య ఏమని సమర్థించుకొనగలవు? రాజును చంపినవాడు, బ్రాహ్మణునిని చంపినవాడు, గోవును చంపినవాడు, దొంగ, ప్రాణులను చంపుటయందు ఆసక్తికలవాడు. వేదము ప్రమాణము కాదనే (లేదా పరలోకము, దేవుడూ లేడనే) నాస్తికుడు, పరివేత్త - వీరందరూ నరకమునకు పోవుదురు. చాడీలు చెప్పువాడు. లోభి, మిత్రుని చంపినవాడు, గురుభాగ్యమనము చేసినవాడు- వీరందరూ పాపాత్ముల లోకమునకు వెళ్ళుదురు. ఈ విషయమున సందేహము లేదు. 
 
నా చర్మము ధరించుటకు యోగ్యము కాదు. నా రోమములు ఎముకలు కూడా సత్పురుషులచేత నిషిద్ధములు. నీవంటి ధర్మాత్ములు నా మాంసమును తినరు. ఐదువేళ్ల జంతువులలో శల్యకము, శ్వావిధము, ఉడుము, చెవులపిల్లి, తాబేలు అను ఐదింటిని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినవచ్చును. అయిదుగోళ్ల జంతువైన నన్ను చంపినావు. బుద్ధిమంతులు నా చర్మమును కానీ ఎముకలను గానీ స్పృశించరు. నా మాంసము తినదగినది కాదు. 
 
  అన్ని విషయములు తెలిసిన తార సత్యమూ, హితము అయిన మాటలు చెప్పినది. కానీ నేను అజ్ఞానముచేత ఆమె మాటలు కాదని యమునికి వశుడనైతిని. చెడ్డ ప్రవర్తనగల భర్త ఉన్నను, శీలసంపన్నురాలైన స్త్రీ ఏవిధముగా మంచి నాథుడు లేనిదే అగుచున్నదో, అట్లే నీవు ఈ భూమికి నాథుడ వన్నమాటే కానీ దీనికి మంచి నాథుడు లేడు. 
 
 రహస్యముగా అప్రియము చేయువాడవు. పరాపకారము చేయువాడవు, నీచుడవు, మనస్సులో అసత్యమైన వినయము గలవాడవు. పాపాత్ముడవు అయిన నీవు మహాత్ముడైన దశరథునకు కుమారుడిగా ఎట్లు పుట్టినావు? రాముడనే ఏనుగు సచ్చరిత్ర మనే నడుము త్రాడు తెగగొట్టి, సత్పురుషుల ధర్మమును అతిక్రమించి, ధర్మమనే అంకుశమును దూరము చేసి, నన్ను చంపివేసింది. 
 
సత్పురుషులు నిందించే అశుభము, అయుక్తము అయిన ఇట్టిపనిచేసి నీవు, పెద్దల సమక్షము ఏమని చెప్పదవు? నీతో శత్రుత్వముకాని, మిత్రత్వముకాని లేని మా విషయమనందు నీవు చూపిన పరాక్రమము నీ శత్రువుల విషయమునందు నీవు చూపుటలేదు. 
 
రామా! యుద్ధరంగంలో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నాచేత చంపబడినవాడవై, ఇప్పుడే యమధర్మరాజును చూచెడివాడవు. నీవు నన్ను యుద్ధములో ఎదిరింపజాలక, కనబడని వాడవై, మద్యము త్రాగి నిద్రపోవుచున్న మనుష్యుని సర్పము చంపినట్లు చంపినావు. 
 
సుగ్రీవునకు ప్రియము చేయదలచిన నీవు ఏ కార్యము కొరకై నన్ను చంపినావో ఆ కార్యము నిమిత్తము నన్నే ముందుగా ప్రేరేపించి ఉన్నచో నేను, నీ భార్యను అపహరించిన, దురాత్ముడైన రావణుని యుద్ధములో చంపకుండా, మెడకు తాడుకట్టి తీసికొని వచ్చి నీకు అప్పగించెడివాడను. సీతను సముద్రజలమధ్యమునందు దాచినా, పాతాళములో దాచినా, నీ ఆజ్ఞచే ఆమెను, మధుకైటభులచే పాతాళములో నిరోధించబడిన ఆడగుర్రము రూపములో ఉన్న శ్రుతిని హయగ్రీవుడు తీసికొని వచ్చినట్లు తీసికొనివచ్చి, నీకు ఇచ్చి వుండెడివాడను. 
 
 నేను స్వర్గస్థుడనైన పిమ్మట సుగ్రీవుడు రాజ్యమును పొందుట యుక్తమే; కానీ నీవు యుద్ధములో అధర్మముగా చంపుట మాత్రము యుక్తము కాదు. లోకము తీరు ఇట్టిదే అనుమాట నిజమే. లోకమును కాలము జన్మమరణాదులందు ఈవిధముగనే నియమించుచుండును. కానీ నీవు చేసిన పని యుక్తమే అని చెప్పుటకు తగిన ప్రత్యుత్తరము చెప్ప కలిగినచో బాగా ఆలోచించిపుము'' బాణ ప్రహారము చేత వ్యథ చెందిన మహాత్ముడైన వాలి, సూర్యునితో సమానుడైన రాముని చూసి, ఇట్లుపలికి, ముఖము శుష్కించగా మౌనము వహించెను. 
 
బాణమును దెబ్బతిని, స్పృహతప్పిన వాలి రామునితో, వినయపూర్వకముగా, ధర్మార్థములతో కూడిన, హితమైన, పరుషమైన వాక్యములను పై విధముగా పలికెను. 
 
వాలి అప్పుడు కాంతి తొలగిన సూర్యుడు వలె, ఉన్న నీరు అంతా వర్షించివేసిన మేఘము వలె, శాంతించిన అగ్నివలె ఉండెను. అట్టి వాలిచే నిందింపబడిన రాముడు అతని మాటలు విన్న పిదప ఇట్లనెను. 
 
 "నీవు ధర్మమును, అర్థమును, కామమును, లోకమర్యాదనను తెలిసికొనకుండా, ఇక్కడ నన్ను ఇప్పుడు అజ్ఞానమువలన ఎందుకు నిందించుచున్నావు? బుద్ధి సంపన్నులు, ఆచారము తెలిసిన ఆచార్యులు మాన్యులు అయిన పెద్దవారిని అడగకుండా, నీవు వానరసహజమైన చాపల్యముచేత, సౌమ్యుడనైన నన్ను నిందింప యత్నించుచున్నావు. 
 
పర్వతములతోను, చిన్న వనములతోను, మహారణ్యములతోను నిండిన ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులకు చెందినది. మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుట, అనుగ్రహించుట అను విషయమునందు కూడా వారికే అధికారము. ఈ భూమిని ఇప్పుడు ధర్మాత్ముడైన భరతుడు పాలించుచున్నాడు. అతడు సత్యమునే పలుకువాడు. వక్రతములేనివాడు. ధర్మ-అర్థ-కామముల తత్త్వము తెలిసినవాడు. దుష్టులను నిగ్రహించుటయు, శిష్టులను అనుగ్రహించుటయందు శ్రద్ధ కలవాడు. ఆ భరతునియందు నీతి, వినయము, సత్యము స్థిరముగా ఉన్నవి. అతడు తగిన పరాక్రమము గలవాడు. దేశకాలములు తెలిసిన రాజు. 
 
ధర్మసంరక్షణము నిమిత్తము అతడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మేము మరికొందరు రాజులు, ధర్మము అవిచ్ఛినముగా ఉండునట్లు చూచుటకై ఈ భూమిమీద అంతటా సంచరించుచున్నాము. రాజులలో శ్రేష్ఠుడైన ధర్మనిరతుడైన ఆ భరతుడు ఈ పృథ్విని పాలించుచుండగా ఎవడు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించగలడు? శ్రేష్ఠమైన మా ధర్మమును పాలించుచున్న మేము భరతుని ఆజ్ఞను పురస్కరించుకొని, ఎవరైనా ధర్మమార్గంమును అతిక్రమించున్నారా అని శాస్త్రానుసారముగా పరిశీలించి చూచుచుందుము. 
 
నీవు రాజధర్మమును అనుసరించక ధర్మమును చెడగొట్టినావు. నింద్యమైన కర్మ చేసినావు. కామభోగములకే ప్రాధాన్యమిచ్చినావు. అన్నగారు, కన్నతండ్రి, విద్యనిచ్చిన గురువు వీరు ముగ్గురు తండ్రులని  ధర్మమార్గమునందున్నవారు తెలుసుకొనవలెను. తమ్ముడు, కుమారుడు, సద్గుణవంతుడైన శిష్యుడు- వీరు ముగ్గురూ తన పుత్రులే అని భావించవలెనను. ఇందుకు ధర్మమే కారణము. 
 
సత్పురుషులాచరించు ధర్మము చాలా సూక్ష్మమైనది. తెలిసికొనుటకు చాలా కష్టమైనది. సకలభూతముల హృదయచములలో ఉన్న ఆత్మయే మంచిచెడ్డలను తెలిసికొనగల్గును. పుట్టుకతో గ్రుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివారైన ఇతరులతో ఆలోచించి నట్లు నీవు చపలస్వభావులు, బుద్ధిని సరైన మార్గములో ఉంచుకొనినవారు అయిన వానరులతో ఆలోచించి ధర్మాధర్మములను తెలిసికొనగలవా?
 
నేను నా మాటల భావమును నీకు సృష్టీకరించెదను. నీవు కేవలము కోపముతో నన్ను ఇట్లు దూషించతగదు. నేను నిన్ను ఎందుకు చంపినానో కారణము వినుము. నీవు శాశ్వతమైన ధర్మమును విడచి సోదరుని భార్యను స్వీకరించినావు. పాపకర్మ చేయు నీవు, మహాత్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగా కోడలివంటిదైన రుమను కామము వలన పొందినావు. అందువలన స్వేచ్ఛగా ప్రవర్తించుచు ధర్మము వ్యతిక్రమించిన నీవు చేసి ఈ సోదరుని భార్యను స్పృశించుట అనే పాపమునకు ఈ దండము ఇవ్వబడినది. 
 
లోకమునకు విరుద్ధముగా ప్రవర్తించుచు, లోకాచారమునకు దూరమైనవానికి దండము తప్ప మరొక ప్రాయశ్చిత్తమేదీ నాకు కనబడదు. ఉత్తమవంశమునందు పుట్టిన క్షత్రియుడైన నేను నీవు చేసిన పాపకర్మను సహించజాలను. ఏ మానవుడు కామమోహితుడై, కుమార్తెను గాని, సోదరినిగాని, తమ్ముని భార్యనుగాని పొందునో అతనికి దండము విధింపబడింది. ఇప్పుడు భరతుడు రాజుగా ఉన్నాడు. మేము అతని ఆజ్ఞను పాలించుచున్నాము. నీవు ధర్మమార్గమున తప్పినావు. ఎట్లు ఉపేక్షించగలము?
 
ధర్మానుసారము రాజ్యపాలనము చేయు బుద్ధిమంతుడైన భరతుడు ఉత్తమమైన ధర్మమును అతిక్రమించువారిని నశింపచేయును. స్వేచ్ఛగా ప్రవర్తించువారిని నిగ్రహించుటకై స్థిరనిశ్చయముతో ఉన్నాడు. మేము భరతుని ఆదేశమును శాస్త్రము వలె పాటించుచు, కట్టుబాట్లను అతిక్రమించిన నీవంటివాళ్లను నిగ్రహించుటకై నిలిచి వున్నాము. 
 
నాకు సుగ్రీవునితో ఏర్పడిన స్నేహము లక్ష్మణునితో స్నేహము వంటిది. భార్య, రాజము నిమిత్తముగా చేసికొని ఏర్పడినది. అతడు నాకు సాహాయ్యము చేయనున్నాడు. నేను నాడు వానరుల సమక్షము నందు ప్రతిజ్ఞకూడ చేసి ఉన్నాను. నావంటివాడు చేసిన ప్రతిజ్ఞను పాలించకుండా ఎట్లుండగలడు? ధర్మసమ్మతములైన ఈ గొప్ప కారణములన్నింటిచేత, నీకు తగిన దండనమే ఇవ్వబడినది. దీనిని నీవు అంగీకరించవలెను. 
 
నిన్ను నిగ్రహించుట అన్ని విధములా ధర్మమే అని గ్రహింపుము. ధర్మమును పాటించువాడు స్నేహితునకు ఉపకారము చేసియే తీరవలెను. ధర్మమును అనుసరించి నీవు కూడా నీకు లభించిన దండము ధర్మ సమ్మతమే అని గ్రహించుము. సచ్చరిత్రము ప్రశంసించు రెండు శ్లోకములను మనువు చెప్పినట్లు వినుచున్నాము. ధర్మమునందు నేర్పుగల వారు వాటిని స్వీకరించారు. నేను కూడా వాటిలో చెప్పిన ప్రకారమే చేసినాను. 
 
పాపాలు చేసిన మానవులు రాజులచేత దండింపబడి, పాపములన్నీ తొలగిపోవుటచే, పుణ్యాత్ముడైన సత్పురుషులవలె స్వర్గమునకు వెళ్ళెదరు. దండమును అనుభవించుటవలన గాని, పట్టి విడువబడుటవలన గాని, దొంగచేసిన పాపమునుండి విముక్తుడగును. కాని సరిగా దండించని రాజుకు ఆ పాపాత్ముని పాపము సంక్రమించును. 
 
పూర్వము శ్రమణుడు నీవు చేసిన పాపము వంటి పాపమునే చేసెను. మా పూర్వపురుషుడు, పూజ్యుడు అయిన మాంధాత అతడిని శిక్షించలేదు. అప్పుడు ఆ పాపము మాంధాతకు సంక్రమించినది. అదేవిధముగా ఏమరుపాటు చెందిన మరికొందరు రాజులు కూడా ఇతరులు చేసిన పాపమును పొందిరి. వాళ్లు ప్రాయశ్చితము చేసికొని ఆ పాపమును తొలగించుకొనుచుందురు. 
 
అందుచేత, నీవు మనస్సులో బాధపడవలసిన పనిలేదు. నిన్నుచంపుట ధర్మసమ్మతమే. మేము స్వతంత్రులము కాము; శాస్త్రమును అనుసరించు వారము. మరియొక కారణము కూడా చెప్పెదను వినుము. ప్రధానమైన ఆ కారణమును విన్న పిమ్మట నీకు కోపము ఉండదు. నిన్ను ఈ విధముగా చంపినందుకు, నీవు నన్ను నిందించినందుకు, నాకు మనస్తాపము గాని, శోకము కానీ లేదు. ఎందుచేతననగా మానవులు దాగి ఉండి గాని, కనబడుచూ గాని అనేక మృగములను వలలతోను, పాశములతోను, ఇంకా అనేక కపటోపాయములతో బంధించుచుందురు. మృగములు పరుగెత్తుచున్నా, భయపడినా, భయములేక కదలకుండా నిలచి ఉన్నా, వాటిని చంపుచుందురు. అట్లు చేయుటలో దోషములేదు. ధర్మవేత్తలైన రాజర్షులు వేటాడుచుందురు కూడా. నీవు నాతో యుద్ధము చేసినా, చేయకపోయినా వానరుడవే కదా! అందుచేతనే నిన్ను యుద్ధములో బాణముతో కొట్టినాను. 
 
సంపాదింప శక్యము కాని ధర్మమును, పవిత్రమైన జీవితమును రాజులే ఇచ్చెదరు. సందేహము లేదు. రాజు లనగా మనుష్యరూపములో భూలోకమునందు సంచరించే దేవతలు. అందుచేత వారిని హింసించ కూడదు; నిందించకూడదు. తేలికగా మాటలాడకూడదు. అప్రియము పలకకూడదు.'' 
 
బాణముచేత పీడింపబడి నేలపై శయనించి ఉన్న వాలి, రాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానమునకు మరొక సమాధానమేమీ కనుగొనలేకపోయెను. వాలి అవయవములన్నీ రాళ్ల దెబ్బలకు నలిగి పోయెను. వృక్షములు దెబ్బలు కూడా ఎక్కువగా తగిలెను. చివరకు రాముని బాణము అతని ప్రాణములు తీసెను. 
 
తరువాత సుగ్రీవునకు రాజ్యపట్టాభిషేకము చేసెను రాముడు. సుగ్రీవుడు రామునకు సీతను వెదికి తీసుకుని వచ్చుటకు తన వానరుల సహాయము అందిస్తానని వాగ్దానమిస్తాడు. మాట ప్రకారము సుగ్రీవుడు  తన సైన్యాన్నంతటిని పిలిచి నాలుగు దిక్కులకు పంపి సీతజాడను తెలిసికొని రమ్మని పంపుతాడు. హనుమంతుని దక్షిణపు దిక్కుకు పంపుతాడు. అక్కడ సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. - ఇంకా వుంది.