24 గంటల పాటు వాట్సాప్ సేవలు నిలిపివేత
వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. అనేక మందికి ఈ పరిస్థితి ఎదురైంది. ఫలితంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక మంది యూజర్లకు తేరుకోలేని షాకిచ్చింది. సోమవారం రాత్రి నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అనేక ఖాతాలను రివ్యూలోకి పంపించింది. దీంతో ఆయా ఖాతాలకు సంబంధించిన అన్ని ఫీచర్లను 24 గంటల పాటు నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో యూజర్లు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురయ్యారు. తమకు ఎదురైన సమస్యను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది. చాలామంది యూజర్లు తమ వాట్సాప్ యాప్‌ను తెరిచినప్పుడు, 'అకౌంట్ ఇన్ రివ్యూ' అనే సందేశం స్క్రీన్‌పై కనిపించింది. "మా సేవా నిబంధనలకు అనుగుణంగా మీ ఖాతా కార్యకలాపాలు, డివైజ్ సమాచారాన్ని మేం తనిఖీ చేస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లోగా ఫలితాన్ని తెలియజేస్తాం" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీంతో పాటు 'వాట్సాప్‌ను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి', 'దొంగిలించబడిన ఫోన్, ఖాతాల గురించి' తెలుసుకునేందుకు ఆప్షన్లు కూడా కనిపించాయి.
ఈ ఆకస్మిక చర్యతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. "ఎలాంటి వివరణ లేకుండా నా వాట్సాప్ ఖాతాను నిలిపివేశారు. అప్పీల్ చేసినప్పటికీ, సమీక్షకు 24 గంటలు పడుతుందని మాత్రమే చూపిస్తోంది. దయచేసి వెంటనే సహాయం చేయండి" అని ఒక యూజర్ పేర్కొన్నారు. "నా వాట్సాప్ ఖాతాను అకస్మాత్తుగా నిలిపివేశారు. నేను అధికారిక యాప్ మాత్రమే వాడుతున్నాను. నా పని మొత్తం వాట్సాపైపైనే ఆధారపడి ఉంది. ఇది చాలా అనవసరం" అంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు.
ఈ గందరగోళంపై మెటా యాజమాన్యంలోని వాట్సాప్ స్పందించింది. "మా సేవలను దుర్వినియోగం చేసే వారిని అరికట్టడానికి, ఇతర యూజర్ల భద్రత కోసం మేము నిరంతరం పనిచేస్తుంటాం. ఈ క్రమంలో కొన్ని ఖాతాలను నిషేధిస్తాం. కొన్నిసార్లు ఈ ప్రక్రియలో పొరపాట్లు జరగవచ్చు. అలా జరిగినప్పుడు, వీలైనంత త్వరగా సమస్యను సరిదిద్ది, యూజర్లు తిరిగి చాటింగ్ చేసుకునేలా చూస్తాం" అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు వివరించారు.
