1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Jharkhand students block road to protest headmaster's transfer

మా సార్ మాకే కావాలి.. హెడ్మాస్టర్ బదిలీపై రోడ్డెక్కిన విద్యార్థులు... దిగొచ్చిన జార్ఖండ్ సర్కారు

students
తమ అభిమాన హెడ్మాస్టర్‌ను బదిలీ చేయడాన్ని విద్యార్థులు అంగీకరించలేదు. ఆయన కోసం ఏకంగా వందలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించి, తమ హెడ్మాస్టర్‌ను బదిలీ చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన మూడు రోజుల పాటు సాగింది. విద్యార్థుల ఉడుంపట్టుతో ప్రభుత్వం దిగివచ్చింది. హెడ్మాస్టర్ బదిలీని ఉపసంహరించుకుంది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్వా జిల్లా కండి బ్లాక్‌లోని ప్రభుత్వం ప్లస్ టూ ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడుగా మలయ్ కుమార్ సింగ్ పని చేస్తున్నారు. ఆయనను విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు. ఆయన హయాంలో పాఠశాల గణనీయమైన పురోగతి సాధించిందని భావించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకుని కండి - భవనాథ్‌పూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 'మా సార్ మాకే కావాలి'.. అంటూ నినాదాలు చేస్తూ గంటల తరబడి వాహనరాకపోకలను స్తంభింపజేశారు. ఈ ఆందోళన గురువారం మరింత తీవ్రతరమైంది. 
 
ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పేందుకు కండి బ్లాక్ చీఫ్ సత్యేంద్ర పాండే విద్యార్థుల వద్దకు వచ్చి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే, విద్యార్థులు ఎంతకీ తన మాట వినికపోవడంతో నిగ్రహం కోల్పోయిన సత్యేంద్ర పాండే ఒక విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన మిగిలిన విద్యార్థులు ఆయనపై దాడికి తెగబడ్డారు. ఆయన కారును ధ్వంసం చేశారు. దీంతో ప్రాణభయంతో ఆయన సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో దూరి ప్రాణాలు కాపాడుకున్నాడు. 
 
అప్పటికీ కొందరు విద్యార్థులు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి తలకు గాయమైంది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విద్యార్థులతో చర్చలు జరిపారు. వారి డిమాండ్‌ను అంగీకరిస్తూ హెడ్మాస్టర్ మలయ్ సింగ్ బదిలీని రద్దు చేసి తిరిగి అదే పాఠశాలలో హెచ్.ఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆ తర్వాత విద్యార్థులతో ఫోనులో ఆయనను మాట్లాడించడంతో వారు శాంతించి తమ ఆందోళనను విరమించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
స్ప్రైట్ శీతలపానీయ బ్రాండ్ పేరుతో నడవనున్న తేజస్ ఎక్స్‌‍ప్రెస్