1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. RSS brought acche din for BJP, says Mohan Bhagwat

ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చింది : మోహన్ భగవత్

mohan bhagwath
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వల్లే భారతీయ జనతా పార్టీ మంచి రోజులు వచ్చాయని, అందుకే అధికారంలోకి వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అప్రతిహత విజయాలకు ఆర్ఎస్ఎస్ విధానాలే కారణమన్నారు. సంఘ్ వల్లే బీజేపీకి అచ్ఛే దిన్ వచ్చాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆర్ఎస్ఎస్‌కు మంచి రోజులు వచ్చాయన్న వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు.
 
నిజానికి బీజేపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీకి మంచి రోజులు రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం విషయంలో సంఘ్ పట్టుదలగా వ్యవహరించడం, ఈ ఉద్యమానికి సహకరించిన పార్టీలకు ప్రయోజనం కలిగిందన్నారు. దీంతో పాటు స్వయం సేవకుల కఠోర శ్రమ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు భారత రత్న పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్‌పై కూడా ఆయన స్పందించారు. ఈ అవార్డు ఎంపిక కమిటీలో తాను లేనని, అ కమిటీలో ఉన్నవారిని కలిస్తే ఈ విషయాన్ని తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పారు. నిజానికి సావర్కర్‌కు భారత రత్న ఇస్తే ఆ అవార్డుకే ఖ్యాతి పెరుగుతుందని చెప్పారు. ఎలాంటి పురస్కారాలు పొందకున్నా కూడా సావర్కర్ కోట్లాది భారతీయుల హృదయాల్లో చక్రవర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు.
తర్వాతి కథనం
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు రావని పవన్ రావడంలేదు: ఎమ్మెల్యే అనిరుధ్