1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. srisalam temple development

తిరుమ‌ల త‌ర‌హాలో శ్రీశైలం అభివృద్ధి....

srisalam temple
తిరుమల తిరుప‌తి తరహాలో శ్రీశైలంను అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పం మొద‌లైంది. శ్రీశైలం మ‌ల్లిఖార్జున ఆలయ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ‌ అధికారులను ఆదేశించింది. రాయలసీమ జిల్లాలో దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే కడప జిల్లా ఒంటిమిట్టలో రామాలయం అభివృద్ధి కోసం పనులను వేగవంతం చేసింది. 
 
ఇప్పుడు తిరుమల తరహాలో కర్నూల్ జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ముందుగా ఆలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలను రూపొందించాలని దేవాదాయ శాఖ అధికారులను సీఎం చంద్ర బాబు ఆదేశించారు. శ్రీశైలం అభివృద్ధిలో భాగంగా ఆలయ సమీపంలో ఉన్న అక్రమ, ప్రైవేటు కట్టడాలను తొలిగించాలని, మాడ వీధులను విస్తరించాలని సీఎం అధికారులకు చెప్పారు. 
 
అదేవిధంగా శ్రీశైలం పరిసరాల్లో 5 వేల ఎకరాల్లో 4నుంచి 5 టౌన్‌షిప్‌లను నిర్మించ‌నున్నారు. శ్రీశైలం అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం చుట్టూ 8 కిమీటర్ల మేర ఔటర్ రింగ్‌రోడ్‌ను నిర్మించాలని సంక‌ల్పించారు. అటవీ భూములకు సంబంధించిన అనుమతుల కోసం ప్రతిపాదనలను తయారు చేస్తున్నారు. 
 
శ్రీశైలం దేవ‌స్థానానికి భ‌క్తుల‌ రాకపోకలకు సులువుగా ఉండేలా ర‌హ‌దారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దోర్నాల-ఆత్మకూరు రోడ్ అబివృద్ధి చేయాలని సీఎం ప్ర‌త్యేకంగా ఆదేశించారు. శ్రీశైలం నుంచే జాతీయ రహదారి వెళుతున్న నేపధ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని చంద్ర‌బాబు భావిస్తున్నారు. 
 
అలాగే శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరో రోజు అక్కడ ఉండాలనిపించేలా ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలని సీఎం అధికారులకు చెప్పారు. మొత్తానికి తిరుమల మాదిరిగా శ్రీశైలం అభివృద్ధి చెంద‌టంపై మల్లన్న భక్తులతో  పాటు క‌ర్నూలు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
About Writer
JSK