నువ్వు గొడ్రాలివే అంటూ నిత్యం వేధిస్తున్న భర్త... కత్తితో నరికి చంపేసిన భార్య
మద్యం సేవించి వచ్చి నువ్వు గొడ్రాలివే, నీకు పిల్లలు పుట్టరే అంటూ నిత్యం వేధిస్తున్న కట్టుకున్న భర్తను ఓ భార్య కిచెన్‌లోని కత్తితో నరికి చంపేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు సమీపంలోని కెంపేగౌడ నగర లక్ష్మీపురలో చోటుచేసుకుంది.
ఈ ప్రాంతానికి చెందిన రాజశేఖర్, మాలాశ్రీ అనే దంపతులు ఉన్నారు. ఒక బ్యాంకులో రుణాల మంజూరు విభాగంలో రాజశేఖర్ పని చేస్తున్నాడు. ఆయనకు మాలాశ్రీతో వివాహమై ఏడేళ్లు అయింది. వారికి సంతానం లేదు.
దీంతో భర్త నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యను వేధించసాగాడు. నవంబరు నెల 11వ తేదీ కూడా ఆయన మద్యం సేవించి వచ్చి నీవు గొడ్రాలివంటూ దుర్భాషలాడారు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో వంటింట్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి భర్తపై భార్య దాడి చేసింది. విచక్షణారహితంగా నరకేయడంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడు. పోలీసులు మాలాశ్రీని అరెస్టు చేసి, విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

