పనిమనిషిని గర్భవతి చేసిన బంగారు వ్యాపారి కుమారుడు... ఎక్కడ?
తమ ఇంట్లో పని చేసే పనిమనిషిని బంగారు నగల వ్యాపారి కుమారుడు గర్భవతిని చేశాడు. ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
కోస్గి పట్టణానికి చెందిన వ్యాపారి కుమారుడు సాయికృష్ణ స్థానికంగా బంగారం దుకాణం నడుపుతున్నాడు. ఈయన ఇంట్లో సుమారు 20 ఏళ్లున్న యువతి పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. ఈ విషయం బహిర్గతం కావడంతో యువతి కుటుంబీకులు సాయికృష్ణ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో ఆయన తండ్రి పెద్ద మనుషులతో మంతనాలు చేశారు.
అయితే ఆ యువతి డబ్బులకు లొంగకుండా సాయికృష్ణ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిచేయడంతో కులం పేరుతో దూషించాడని శనివారం పోలీసులను ఆశ్రయించింది. స్థానిక పోలీసులకు రాజకీయ నేతలు మాట్లాడుకుంటామని సర్ది చెప్పడంతో కేసు నమోదు కాలేదు. అయితే, బాధితురాలి మాత్రం పట్టువీడకుండా ఒత్తిడి చేయడంతో యువకుడు సాయికృష్ణపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. యువతిని పరీక్షల నిమిత్తం నారాయణపేట జిల్లా కేంద్రానికి తరలించారు.
కాగా, అట్రాసిటీ కేసు నమోదైన ఘటనపై సోమవారం రాత్రి పేట డీఎస్పీ లింగయ్య విచారణ చేపట్టారు. సదరు వ్యాపారి ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను విచారించారు. యువతి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. దుకాణం చుట్టుపక్కల, ఇంటి పరిసరాల్లో సాయికృష్ణ ప్రవర్తనపై ఆరా తీశారు. నివేదికను ఎస్పీకి అందజేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
