1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Police search Operation For Shabad Murder Case Accused

షాబాద్ సీరియల్ కిల్లర్ కోసం వేట - 12 బృందాలతో గాలింపు

shabad accused
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. గాలింపు బృందాల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు అతడు ఉపయోగించిన సిమ్‌ కార్డులతో పాటు బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 
 
అయితే, ఈ హత్యల తర్వాత నిందితుడు ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక, ఇతర ప్రాంతాలకు వెళ్లే హైవేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 44వ నంబర్‌ జాతీయ రహదారి వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలు, లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 
తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో తొలుత బాలిక తల్లి, నానమ్మలను రాజ్‌కుమార్‌ కత్తిపోట్లతో కడతేర్చాడు. తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికను గొంతుకోసి చంపేశాడు. అనంతరం ఇంటికెళ్లి భార్య, నిద్రిస్తున్న కన్న బిడ్డల గొంతుకోసి కర్కశంగా హతమార్చాడు. మొత్తం అరగంట వ్యవధిలో మూడు ప్రాంతాల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక, ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారుల్ని కిరాతకంగా అంతమొందించాడు. 
 
ఈ ఆరు హత్యలు గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మరోవైపు, పరారీలో ఉన్న నిందితుడిని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఘటన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు షాబాద్‌ ఎస్సై రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ముంబై ఆస్పత్రిలో పవన్‌కు ఆపరేషన్ - పరామర్శించిన సీఎం చంద్రబాబు