బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:07 IST)

అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు!

telangana new secretariat
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే ఈ భవనాన్ని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలను ఆహ్వానించనున్నారు. వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తదితరులను ఆహ్వానించనున్నారు. 
 
నిజానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 17వ తేదీన జరుగనున్నాయి. ఆ రోజున ఈ సచివాలయ కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఇందులోభాగంగా, అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీని ప్రారంభించాలని ముహూర్తంగా ఖరారు చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
 
అలాగే, ముందుగా అనుకున్నట్టు ఈ ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇపుడు ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. అదేసమయంలో ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.