షార్ట్ ఫిల్మ్స్ చేసే స్థాయి నుంచి హీరోగా ఎదిగే స్థాయి వరకు అండగా నిలిచారు : నటుడు సుహాస్
టాలీవుడ్ నటుడు సుహాస్ శుక్రవారం ఓ ఎమోషనల్ లేఖను విడుదల చేశారు. షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి హీరోగా ఎదిగే స్థాయి వరకు అభిమానులు, ప్రేక్షకులు అండగా నిలిచారని పేర్కొన్నార. ఇదే అంశంపై ఆయన సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ చేశారు.
'యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసే రోజుల నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆపై హీరోగా ఎదిగే వరకు మీరు నాకు అండగా నిలిచారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ ప్రేమ, ప్రోత్సాహం, నాపై మీకున్న నమ్మకమే. మీరిచ్చిన గుర్తింపే నాకు ఎన్నో అవకాశాలకు తలుపులు తెరిచింది. అందులో భాగమే 'మండాడి' కూడా. నా పనితనాన్ని బట్టి మీరు నన్ను ఆదరించారు.
కెరీర్ ప్రారంభంలో నాకు అండగా నిలిచి, నన్ను ఈ స్థాయికి చేర్చిన వారిని నేను ఎప్పటికీ మర్చిపోను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నా నటనతో మరింత కష్టపడి పనిచేస్తాను. 'మండాడి' సినిమాను, అందులో నా పాత్రను ఇంతగా ఆదరిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని సుహాస్ తన లేఖలో పేర్కొన్నారు.
సుహాస్, సూరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం 'మండాడి'. స్పోర్ట్స్‌యాక్షన్ డ్రామాగా దర్శకుడు మదిమారన్ పుగళేంది తెరకెక్కించారు. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
