వారంతా ఒక్కటే.. ఏ ఒక్కరినీ నమ్మొద్దు : హీరో శివాజీ
టాలీవుడ్ హీరో శివాజీ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే, ఈ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను నమ్మొద్దంటూ హీరో శివాజీ పిలుపునిచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనలకు శివాజీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందని శివాజీ విమర్శించారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఎలుగెత్తాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మవద్దని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సూచించారు. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని స్పష్టం చేశారు. మా ప్రాంతం కోసం మీరేం చేస్తున్నారంటూ నేతలను ఢిల్లీకి పరుగులు తీయించాలని అన్నారు.
తాను అరెస్టులకు భయపడేవాడిని కాదన్నారు. కొందరు అధికార బలంతో తెలంగాణలోనూ తనపై అన్యాయంగా పలు కేసులు పెట్టారని, అలాంటి కేసులేవీ తనను నిలువరించలేవన్నారు. పైగా, తాను తప్పేం చేయలేదు కాబట్టే కోర్టు అండగా నిలిచిందని హీరో శివాజీ గుర్తుచేశారు.