ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2025 (12:40 IST)

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

pawan in book fair
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పుస్తక పఠన ప్రియుడు. అందుకే ఆయనను పుస్తకాల పురుగు అని అంటారు. అన్నపానీయాలు లేకపోయినా సహిస్తారు గానీ చేతిలో ఒక పుస్తకం లేకపోతే తట్టుకోలేరు. ఈ విషయం తాజాగా నిరూపితమైంది కూడా. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో 35వ పుస్తక మహోత్సవం జరుగుతుంది. దీన్ని పవన్ కల్యాణ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏకంగా రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాల్ని కొన్నారు. 
 
వీటిలో కొన్నింటిని పిఠాపురంలో స్థాపించబోయే గ్రంథాలయంలో ఉంచనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంటకు పుస్తక మహోత్సవానికి సందర్శకులను అనుమతిస్తుండగా... పవన్ కల్యాణ్ కోసం ఉదయాన్నే తెరిచారు. రెండున్నర గంటలకు పైగా స్టాళ్లను పరిశీలించిన పవన్ పెద్దసంఖ్యలో పుస్తకాల్ని కొన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల పుస్తకాలను, సాహిత్యానికి సంబంధించిన పలు గ్రంథాలను, నాటి, నేటి రచయితల రచనలను పరిశీలిస్తూ.. కొనుగోలు చేశారు.
 
భారతీయ చట్టాలు, చరిత్ర, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ పాలసీ, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, పర్యావరణ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన రచనలు, నిఘంటువులూ పవన్ కొన్నవాటిలో ఉన్నాయి. డాక్టర్ విక్టర్ ఇ. ఫ్రాంక్ట్ రాసిన 'మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్' పుస్తకాన్ని చూసి.. ఇది తనకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. ఆ పుస్తకం చదివితే నిరాశా నిస్పృహలు తొలగి, ఆశావహ దృక్పథం అలవడుతుందన్నారు. రచయిత రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీల నిర్బంధంలో ఉన్నప్పుడు రాసిన పుస్తకమిదని వివరించారు.
 
ఆ పుస్తకాన్ని తాను బహుమతిగా ఇస్తానంటూ పెద్దసంఖ్యలో ప్రతులను కొన్నారు. పుస్తక మహోత్సవ సమన్వయకర్త ఎమెస్కో విజయకుమార్, అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి మనోహర్ నాయుడు తదితరులు పవన్‌కు ఒక్కో స్టాల్‌ను చూపిస్తూ... పుస్తకాల కొనుగోలుకు సహకరించారు.