సోమవారం, 11 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 6 డిశెంబరు 2017 (18:42 IST)

12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెడీ... శాడిస్ట్ ఉపాధ్యాయుడ్ని తొలగించాం...

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) 2018 నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పోస్టింగులు ఇచ్చేలా ఆ ష

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) 2018 నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పోస్టింగులు ఇచ్చేలా ఆ షెడ్యూలును రూపొందించింది. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ 2018 షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ సెంటర్‌గా, ఎడ్యూకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం రూ.23,209 వేల కోట్లకుపైగా వెచ్చిస్తోందన్నారు. కేవలం పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతోందన్నారు.
 
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) 2018  షెడ్యూల్ వివరాలు : 
డీస్సీ నోటిఫికేషన్ జారీ 15.12.2017
దరఖాస్తుల స్వీకరణ 26.12.2017 నుంచి 8.2.2018 వరకూ...
(45 రోజుల పాటు...ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ)
హాల్ టికెట్ల డౌన్ లోడ్ 9.3.2018 నుంచి...
పరీక్షలు జరిగే రోజు 23.3.2018, 24.3.2018, 26.3.2018
(3 రోజుల పాటు)
ప్రారంభ కీ విడుదల 9.4.2018
కీపై అభ్యంతరాల స్వీకరణ 10.4.2018 నుంచి 16.4.2018 వరకూ
(6 రోజుల పాటు)
ఫైనల్ కీ విడుదల 30.4.2018
మెరిట్ లిస్టు 5.5.2018
అభ్యర్థులకు సమాచారం 11.5.2018
ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన 14.5.2018  నుంచి 19.5.2018
మెడికల్ సర్టిఫికెట్ల అందజేత 31.5.2018
ఫైనల్ సెలక్షన్ జాబితా 1.6.2018 నుంచి 6.6.2018
ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ లు 8.6.2018 నుంచి 11.6.2018 వరకూ...
 
12,370 పోస్టుల భర్తీ...
డీస్సీ 2018 ద్వారా 12,370 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 10.313, మోడల్ పాఠశాలల్లో 1,197, స్పెషల్ ఎడ్యూకేటర్ కు సంబంధించిన 860 పోస్టులు ఉన్నాయన్నారు. 10,313 పోస్టులకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపిందని, మిగిలిన పోస్టుల క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. డీఎస్సీ రాత పరీక్ష మాత్రం 12,370 పోస్టులకు సంబంధించే జరుగుతుందన్నారు. 
 
డిసెంబర్, జనవరిలో టెట్...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ చేసి, నాణ్యమైన విద్య అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్, జనవరిలో టీచర్ ఎలిజిబుల్ టెస్(టెట్) నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు.
 
1998, 2008, 2012 క్వాలిఫయర్లకు న్యాయం చేస్తాం...
1998, 2008, 2012 క్వాలిఫయర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయం చేసి తీరుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్సీలు, ఇతర సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. దీనికి సంబంధించిన జీవో జారీ చేయనున్నామన్నారు. 
 
విద్యార్థులపై ఒత్తిడి తెస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం...
విద్యార్థులపై చదువు పేరుతో ఒత్తిడి తెస్తే సహించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఇప్పటికే పలు యాజమాన్యాలు తమ షెడ్యూళ్లను మార్చుకున్నాయన్నారు. విద్యార్థులతో పాఠ్యపుస్తకాలతో పాటు దినపత్రికలు, ఇతర నాలెడ్జ్ పుస్తకాలు చదవిస్తూ ఒత్తిడి తగ్గించినట్లు తెలిసిందన్నారు. చదువు పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చినా, రానున్న వేసవిలో శిక్షణా తరగతుల పేరుతో పాఠశాలలు తెరిస్తే సంబంధిత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్ జంబ్లింగ్ విధానం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం మొదటి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 
 
మోడల్ స్కూళ్ల టీచర్ల జీతాల నిమిత్తం రూ.82 కోట్ల కేటాయింపు...
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపునకు ప్రభుత్వం ముందుకొచ్చిందని తాను ప్రకటించానని, ఆ విషయం తెలుసుకోకుండా జగన్ నిర్లక్ష్యంగా మాట్లాడడం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రూ.82 కోట్లు కేటాయస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదరిగా జీతాలు చెలిస్తామన్నారు. 
 
కడప జిల్లాలో నవ వధువుపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డిని విధుల నుంచి తొలగించినట్లు మంత్రి గంటా తెలిపారు. పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంటర్ విద్యా కమిషనర్ ఉదయ్ లక్ష్మి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సంధ్యరాణి తదితరులు పాల్గొన్నారు.