వైసీపీకి బిగ్ షాక్ : ప్రాథమిక సభ్యత్వానికి బాలినేని రాజీనామా.. రేపు పవన్‌తో భేటీ!
గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారానికి దూరమైన వైకాపాకు వరుసషాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇపుడు పార్టీలో కీలక నేతగాన, పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా ఉన్న మాజీ మంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమీపం బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి షాకిచ్చారు. పార్టీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన.. ఇటీవల జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత కూడా తన బెట్టు వీడలేదు.
అదేసమయంలో ఆయన ఒంగోలులో తన అనుచరులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకుని జగన్ దూతగా మాజీ మంత్రి వడదల రజినీ రాయబారిగా వెళ్లి బాలినేనిని బుజ్జగించారు. అయినప్పటికీ బాలినేని ఏమాత్రం మెట్టుదిగలేదు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలావుంటే, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో గురువారం ఆయన భేటీకానున్నారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.