శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (16:39 IST)

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

chandrababu
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఏకంగా 500 పేజీలతో కూడిన కౌంటర్‌ను దాఖలు చేశారు. దీంతో విచారణను వాయిదా వేసింది.
 
కాగా, రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
 
ఇదే కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఏ14గా సీఐడీ పోలీసులు పేరు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన వద్ద సీఐడీ పోలీసులు ఇటీవల రెండు రోజుల పాటు విచారణ కూడా జరిపిన విషయం తెల్సిందే. అయితే, ఈ కేసులో నారా లోకేశ్‌ను అరెస్టు చేసే ముందు 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే విచారిస్తామని ప్రకటించారు. 
 
దసరా సెలవులకు ఇంటికొచ్చిన విద్యార్థిని గుండెపోటుతో మృతి 
 
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఏడో తరగతి బాలిక ఒకరు గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ బాలిక ఇంటితో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పగా తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కన్నుమూశారు. 
 
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంజర గ్రామానికి చెందిన అదరంగి మైథిలి అనే బాలిక ఏడో తరగతి చదువుతుంది. ఆమె అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.
 
దీంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించరు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.