మన్ కీ బాత్ తరహాలో డయలు యువర్ సీఎం : చంద్రబాబు వెల్లడి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలలో ఒకసారి చేపట్టే మన్ కీ బాత్ తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజలతో మాట్లాడేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా డయల్ యువర్ సీఎం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కొత్త కార్యక్రమంతో ప్రజలతో ముఖాముఖీ ఆడియో, వీడియో రూపంలో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం జనప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సమస్యలు, విశిష్ట వ్యక్తులు, సందర్భాలపై ప్రధాని మోడీ మాట్లాడుతూ జనాల్లోకి తీసుకెళుతున్నారు. 'మన్ కీ బాత్' తరహాలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక కార్యక్రమం ద్వారా నేరుగా ఏపీ ప్రజలతో ముఖాముఖీ మాట్లాడబోతున్నారు.
ఆడియో, వీడియో రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు బుధవారం కీలక ప్రకటన చేశారు.
త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 'డయల్ యువర్ సీఎం' ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం, మన్ కీ బాత్ కలయిక ద్వారా ఒక నూతన కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన సిద్ధమవుతున్నారని తెలిసింది.