ఆంధ్రాలో 2 వేలు దాటిన కరోనా కేసులు - చిత్తూరును దెబ్బతీసిన కోయంబేడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎట్టకేలకు రెండు వేలుదాటిపోయాయి. గత 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కు చేరుకుంది.
ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5 కేసులు నమోదయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
కృష్ణాలో 3, నెల్లూరులో 1 , కర్నూలులో 9, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని వివరించింది. అయితే, చిత్తూరులో నమోదైన 9 కేసుల్లో ఎనిమిది కేసులకు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో లింకు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు.
ఇకపోతే, జిల్లా వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపూర్ 115, చిత్తూరు 121, గుంటూరు 387, కడప 97, కృష్ణ 342, కర్నూలు 575, నెల్లూరు 102, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 66, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, ఇతరులు 27 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ 27 కేసుల్లో 27 మంది గుజరాత్, ఒకరు కర్నాటకకు చెందిన వలస కూలీలు ఉన్నారు.