ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (14:54 IST)

ప్రైవేట్ బస్సులే కాదు.. ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురవుతున్నాయి : జేసీ ప్రభాకర్ రెడ్డి

రాష్ట్రంలో కేవలం ప్రైవేట్ బస్సులే కాదు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురవుతున్నాయని దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దివాకర్ ట్రావెల్స్‌కు చెంద

రాష్ట్రంలో కేవలం ప్రైవేట్ బస్సులే కాదు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురవుతున్నాయని దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురై 11 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీనిపై ఆ ట్రావెల్స్ సంస్థ అధినేతగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.
 
ఈ ఘటన తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గాయపడిన వారిని ఆదుకుంటామని, వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా చూడాలని ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులను కోరామన్నారు. తమ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో ముందుంటాయని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 
 
పైగా, బస్సు పాతది కాదనీ, కొత్త బస్సు అని చెప్పారు. ఈ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు సాధారణమన్నారు. ప్రమాదాలకు గురయ్యే బస్సుల్లో కేవలం ప్రైవేట్ బస్సులకే కాదు.. ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
ఇదిలావుండగా దివాకర్ ట్రావెల్స్‌పై సెక్షన్ 337, 338 కింద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 11 మంది ప్రయాణికులు చనిపోయిన ఈ ప్రమాదంపై ఐపీసీ సెక్షన్ 337, 338, 304ఏ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, నిబంధనల అతిక్రమణ వంటి అభియోగాలను మోపారు. మితిమీరిన వేగం వల్లనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
రెండున్నర అడుగుల ఎత్తయిన రెయిలింగ్‌ను ఢీకొట్టి, దానిపై నుంచి బస్సు కాలువలోకి పడిపోయిందంటే, ఆ బస్సు గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బస్సు ఢీకొన్నా రెయిలింగ్ పూర్తిగా దెబ్బతినలేదని, రెయిలింగ్ బలంగానే ఉందని తెలిపారు. బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాఫ్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.