శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (02:17 IST)

అమ్మ భార్య పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు.. కష్టకాలంలో టార్గెట్ చేయడం న్యాయమేనా: పూరీ ఆవేదన

డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన అరోపణలపై సిట్ జరిపిన విచారణ కంటే కష్టకాలంలో తనను టార్గెట్ చేసి మీడియాలో రోజుల తరబడి చిలవలు పలువలుగా వార్తలు రావడం తీవ్రంగా బాధకు గురి చేసిందని టాలివుడ్ దర్శకుడు పూరి జగన్నాథ

డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన అరోపణలపై సిట్ జరిపిన విచారణ కంటే కష్టకాలంలో తనను టార్గెట్ చేసి మీడియాలో రోజుల తరబడి చిలవలు పలువలుగా వార్తలు రావడం తీవ్రంగా బాధకు గురి చేసిందని టాలివుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సినిమా వాళ్లమైనా మాకూ కుటుంబాలు ఉంటాయన్న విషయం మర్చిపోయి మీడియాలో ప్రసారం చేసిన, ప్రచురించిన తప్పుడు కథనాలతో కుటుంబ జీవితాలనే నాశనం చేశారని, ఈ ప్రచారం ఫలితంగా మా అమ్మ, భార్యా పిల్లలు, తమ్ముళ్లు నాలుగు రోజులుగా విలపిస్తునే ఉన్నారని పూరీ విచారపడ్డారు. డ్రగ్స్‌ విషయంలోనేకాదు మరే ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటానన్నారు.
 
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తో సంబంధాలపై సిట్ నోటీసులు జారీ చేసిన చిత్రరంగ ప్రముఖులలో పూరీ జగన్నాథ్ ఒకరు. సిట్ నోటీసు ప్రకారం బుధవారం నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లిన పూరీ దాదాపు పదిగంటలకుపైగా సిట్ చేసిన విచారణలో పాల్గొన్నారు. పూరీ నుంచి కూలంకషంగా సమాచారం సేకరించిన సిట్ బృందం పూరిని బుధవారం రాత్రి ఇంటికి పంపించింది.  పూరీని విచారించే ప్రక్రియ ముగిసిందని ప్రకటించింది. 
 
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తను తీవ్రంగా బాధించాయని పూరీ జగన్నాథ్‌ అన్నారు. తప్పుడు కథనాలతో జీవితాలను నాశనం చేశారు. మా అమ్మ, భార్యా, పిల్లలు, తమ్ముళ్లు నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నారు అని పేర్కొన్నారు.
 
మీడియాలో అందరూ తనకు తెలిసినవాళ్లే అయినా, కష్టకాలంలో టార్గెట్ చేయడం బాధకలిగించిందని అన్నారు. వ్యక్తిగతంగా తాను బాధ్యతాయుతంగా ఉంటానని, డ్రగ్స్‌ విషయంలోనేకాదు మరే ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటానన్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏదైనా ఉంటే సిట్ అధికారులు చెబుతారని పూరీ ముగించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే వాళ్లపై చాలా సినిమాలు తీశానని పూరీ చెప్పుకొచ్చారు. 
 
పూరీ వ్యక్తం చేసిన ఆవేదన, విచారంలో ఒక మానవీయ కోణం ఉంది. తాను నిజంగా తప్పు చేసి ఉంటే పూరి దానికి బాధ్యత వహించాలి. దాని  ఫలితాన్ని అనుభవించాలి కూడా. కానీ ఒక సీరియస్ వ్యవహారం బయటపడిన క్రమంలో పోలీసు, దర్యాప్తు సంఘాల విచారణ ప్రక్రియను బైపాస్ చేసి తానే మోరల్ పోలీసుగా, తానే తీర్పు ఇచ్చే జడ్జిగా వ్యవహరిస్తూ మీడియా చేస్తున్న ప్రసారాలు, వార్తలు, కట్టుకథలు, పుకార్లు వల్ల ఆరోపణలకు గురైన వారి కుటుంబాలు ఎంత సంక్షోభాన్ని, మానసిక వ్యథను అనుభవిస్తున్నాయో మీడియా పెద్దలకు అర్థం అవుతోందా.. 
 
నిజంగానే ఇది మీడియా వ్యక్తుల, సెలబ్రిటీల జీవితాలపై అల్లుతున్న విషవలయం. వ్యక్తులుగా ఉంటే ఏమీ అనం కానీ బహరంగంగా వస్తే ఏమైనా అంటాం  అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత్వాన్ని వక్రీకరిస్తూ మీడియా ఇవ్వాళ కుటుంబ జీవితాలను కూడా కల్లోల పరుస్తోంది. ఒక వార్తను సంచలనాత్మకంగా అల్లడం దానికి వివరణల పేరుతో తల్లిని, భార్యను, సోదరిలను, పిల్లలను ముగ్గులోకి లాకి ఇష్టమొచ్చినట్లుగా ప్రశ్నలు సంధించి కుటుంబాన్ని మొత్తం ఇంటరాగేషన్ సెల్‌లోకి నెట్టడం న్యాయమేనా... ఆరోపణలకు గురైన కుటుంబాల పరువు ప్రతిష్టలు గంగలో కలిపివేయడానికి మీడియాకు ఎవరు అధికారం ఇచ్చారు?
 
మనకళ్ల ముందు జరుగుతున్న ఈ ప్రహసనానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగింపు పలికితేనే మంచిది. పూరీ.. ఆవేదన సరైందే. తనపై వచ్చిన ఆరోపణల సత్యసంధతను సిట్ దర్యాప్తు సంస్థలు నిగ్గు తేలుస్తాయి. అవి నిజామా కాదా అనే విషయంపై తుది ప్రకటన వచ్చేంతవరకు పూరీ తనపై ఉన్న ఈ అగ్నిపరీక్షను ఎదుర్కోవలసి ఉంది. తప్పదు. కానీ ఆయన కుటుంబాన్ని, వారి గౌరవాన్ని కాస్త బజారున పడేయకుండా వదిలేద్దామా.. భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనేది పూరీకి సంబంధించిన విషయం. ఇప్పుడు తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తాను ఎదుర్కుంటారు. ఫలితం అనుభవిస్తారు కూడా. కానీ కుటుంబాలను వీధిలోకి లాక్కుండా మీడియా కాస్త సంయమనం పాటిస్తే మంచిదేమో..