గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 4 ఫిబ్రవరి 2017 (03:03 IST)

నన్ను అవమానిస్తే.. వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లే: శివంగిలా లేచిన పెద్దామె..

కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం చేసుకునేవాళ్లకు తల్లిప్రేమ గురించి ఏం తెలుస్తుందంటూ ఒక పరుషమైన వ్యాఖ్య ఆ తల్లి ప్రేమనే హేళన చేసిన వారిపై బూమెరాంగ్‌లా పడింది. పడటమే కాదు. "నన్ను అవమానిస్తే వాడి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు క

కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం చేసుకునేవాళ్లకు తల్లిప్రేమ గురించి ఏం తెలుస్తుందంటూ ఒక పరుషమైన వ్యాఖ్య ఆ తల్లి ప్రేమనే హేళన చేసిన వారిపై బూమెరాంగ్‌లా పడింది. పడటమే కాదు. "నన్ను అవమానిస్తే వాడి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు కాదు, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లు అవుతుంది. రాసేటప్పుడు వయసును బట్టి రాయాలి మీరు. ఏదో చేతికి వచ్చేసిందని రాయకూడదు" అంటూ ఒక తల్లి తనను అనరాని మాటలతో అవమానించిన వారిని జాడించి పారేసింది. 
 
తల్లి మనసుతో బిడ్డ లాంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా ముద్దాడుతున్న ఓ పెద్దావిడను ఉద్దేశించి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నోటికి వచ్చినట్లు కారుకూతలు రాయడంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం చేసుకునేవాళ్లకు తల్లిప్రేమ గురించి ఏం తెలుస్తుందని ఈ ఘటనపై పలువురు మండిపడ్డారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను అప్యాయంగా ముద్దుపెట్టుకున్న వైనం గురించి నోటికొచ్చిన‌ట్లు వాగిన తెలుగు త‌మ్ముళ్ల‌కు నోరు మూయించేలా చెప్పుతో కొట్టినట్లు స‌మాధానం ఇచ్చారు ఈ పెద్దావిడ‌. ఆవిడేమన్నారో ఆవిడ మాటల్లోనే విందాం.. 
 
''నాకు ముగ్గురు కొడుకులు. ఒకడికి 45, మరొకడికి 40, ఇంకొకడికి 35 ఏళ్లున్నాయి. నా వయసు ఎంతో, నా పిల్లల వయసు ఎంతో అర్థం చేసుకోండి. పాపపు మాటలు మాట్లాడకండి. నా బిడ్డలాంటోడు మా ఊరు వచ్చాడు, మా పల్లెటూరు వచ్చాడు. మేం ఆ దేశం వెళ్లి ఆ మారాజును చూడలేమని, మా దగ్గరకు వచ్చాడని ఆప్యాయంగా వెళ్లాను. అంతే గానీ, రాజకీయం అయితే మేం చూడనే చూడం. ఎవరైనా చూడం, మాకు ఎవరైనా ఒకటే. మనం ఆవేళ వేసేది ఒక్కే ఓటు. ఇవన్నీ మాకేం తెలుస్తాయి మీరనుకునేవన్నీ చెత్తమాటలు. చెత్త రాయద్దు. చెత్తమాటలు రాశారా పాపం కట్టుకుపోతారు. జరిగిన వాస్తవం రాసుకోండి. నా వయసు ఏంటో గుర్తుంచుకోండి. వాడి తల్లిలాంటిదాన్నని చెప్పు. నన్ను అవమానిస్తే వాడి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు కాదు, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లు అవుతుంది. రాసేటప్పుడు వయసును బట్టి రాయాలి మీరు. ఏదో చేతికి వచ్చేసిందని రాయకూడదు.'' 
 
జనంతో కలిసినప్పుడు ఎలా మెలగాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఎవరో పనికట్టుకుని చెబితే వచ్చిది కాదు. కృత్రిమంగా నటిస్తే అబ్బేది అంతకంటే కాదు. సభల్లో, జనాల్లో మాట్లాడుతుంటే ప్రశ్నించినంత మాత్రానికే ఇంట్లో కట్టుకున్న భార్యను గద్దించినట్లుగా ఏయ్.. ఏయ్.. నోరు మూసుకో,, చెప్పేది విని అనే పెద్దమనుషులు కూడా ఒకరు నేర్పితే నేర్చుకున్న మాటలు కాదవి. జనంతో మెలగడంలో అది వారికి సహజాతి సహజంగా అబ్బిన గుణం. దాన్నెవరూ మార్చలేరు కదా. 
 
మనిషి కనబడితే చేతులు పట్టుకునో, గడ్డం పట్టుకునో, తల నిమిరో.. ఆప్యాయతను తమకు తోచిన రీతిలో ప్రదర్శించేవారికి కూడా అది ఎవరో నేర్పితే వచ్చిన కళ  కాదు. జనం కింద కూర్చుంటే వారితోపాటు తాను కింద కూర్చోవాలి, వారిలో ఒకరిగా ఉండాలి, వారు చెప్పింది వారికి సన్నిహితంగా ఉండి వినాలి. సాంత్వన పర్చాలి అనే ప్రవర్తన పెంపకంలోంచే రావాలి కాని ఎవరో చెబితే వచ్చేది కాదు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పై రెండు రకాల వ్యక్తిత్వ ప్రదర్శనలు రాజకీయ అధినేతల్లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఎదురుమాట్లాడితే మహిళలని కూడా చూడకుండా ఏయ్ అంటూ సత్కరించే బాపతు ఎవరో.. మనిషి కనపడితే సాగిలబడి వారి ముందు కూర్చుని అంతరాలులేని సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే బాపతు ఎవరో మళ్లీ పేరు పెట్టి చెప్పాల్సిన పనిలేదు. వయసు మళ్లిన పెద్దామె తమ వద్దకు, తమకు అతి సమీపంగా వచ్చిన నేతను కుటుంబంలో ఒకరిగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటే కూడా శంకించే, హేళన చేసే, రాజకీయ ప్రేలాపనలు చేసే ట్విట్టర్లలో కారుకూతలు కూసే బాపతు రాజకీయాలు ఏపీని ఏలుతున్నాయంటే దీనికి ఎవరూ ఎవరినీ నిందించాల్సిన పని లేదు. 
 
"నన్ను అవమానిస్తే వాడి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు కాదు, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లు అవుతుంది"
 
"మేం ఆ దేశం వెళ్లి ఆ మారాజును చూడలేమని, మా దగ్గరకు వచ్చాడని ఆప్యాయంగా వెళ్లాను. అంతే గానీ, రాజకీయం అయితే మేం చూడనే చూడం. ఎవరైనా చూడం, మాకు ఎవరైనా ఒకటే. మనం ఆవేళ వేసేది ఒక్కే ఓటు. ఇవన్నీ మాకేం తెలుస్తాయి మీరనుకునేవన్నీ చెత్తమాటలు. చెత్త రాయద్దు."
 
ఒక తల్లి హృదయంలోంచి ఈ మాటలు ఎంత శక్తివంతంగా పేలాయో మరి. దీనిమీద ఇక ఎవరి కామెంట్లూ అవసరం లేదు. అలా కూతలు కూసినవారికి ఆమె పిట్టింగ్ రిప్లై ఒకటి చాలు.
 
రాజకీయాలకేం బోలెడు... కువ్యాఖ్యలకు, దుర్వ్యాఖ్యలకు, బూతులకు, నిందలకు, హేళనలకు పదాలూ, సందర్భాలు బోలెడు దొరుకుతాయి.. ఎవరూ కాదనరు. ఎవరి అభిప్రాయాలు, ఎవరి సమర్థనలు వారికి ఉంటాయి. వాటినీ భరిద్దాం. 
 
కానీ వీటన్నింటికీ అతీతమైన మానవీయ స్పందన ఒకటి ఎప్పటికీ లోకంలో ఉంటూనే ఉంటుందని చళ్లున చరిచి మరీ బుద్ధి చెప్పిన ఆ పెద్దావిడకు చేతులెత్తి నమస్కరిద్దాం.