ప్రియురాలు మాట్లాడటం లేదనీ....
హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడలో ఓ మైనర్ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియురాలు మాట్లాడటం లేదని తీవ్ర మనస్థానికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్‌కు చెందిన యాదయ్యకు ఒక కుమారుడు బి.నరేష్(16), ఇద్దరు కుమార్తెలు. నరేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చాంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లిన నరేష్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నైట్‌షిప్ట్ కూడా డ్యూటీ ఉందని... ఇంటికి రావడం లేదని తెలిపాడు. బుధవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వారి వారి పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న నరేష్ ఇంటి పైకప్పు రేకుల పైప్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తలుపులు నెట్టినా రాకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా నరేష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఓ బాలికతో నరేష్ ప్రేమలో ఉన్నాడని.... ఇటీవల ఆ బాలిక మాట్లాడకపోవడంతో వారం రోజుల నుంచి ముభావంగా ఉన్నాడని.... ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.