బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (06:16 IST)

బీసీలకు జగన్ తీవ్రమైన అన్యాయం: కొల్లు రవీంద్ర

జగన్మోహన్ రెడ్డి బీసీలను ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడని, 18నెలల తనపాలనలో బీసీవర్గాలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లద్వారా బీసీలకు ఏం ఒరగబెట్టారో, ఏంసాధించారో పాలకులు సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలంటే, ఆర్థికశాఖ అనుమతితీసుకొని, అందుకు ఉన్న చట్టాలను అనుసరించి వాటిని ఏర్పాటుచేయాల్సి ఉండగా, వైసీపీప్రభుత్వం ఎక్కడాకూడా నిబంధనలప్రకారం బీసీకార్పొరేషన్లను ఏర్పాటు చేయలేదన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ తొలుత బీసీలకుఫెడరేషన్లు ఏర్పాటుచేశారని, ఆర్థికశాఖ నుంచి వాటికి నిధులుకేటాయించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఏ అనుమతులప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటుచేసిందో చెప్పాలన్నారు. హోదాలు, పదవులకోసం, బీసీలను మభ్యపెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటుచేశాడని రవీంద్ర తేల్చిచెప్పారు.

అగ్రవర్ణాలకు ఉన్నతమైన కీలకమైన పదవులను అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, టీటీడీ పాలకవర్గంలో ఎవరిని నియమించారో, వీసీలుగా ఏవర్గానికి పట్టం కట్టారో, తనప్రభుత్వంలో సలహాదారులుగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాలన్నారు. కూర్చోవడానికి కుర్చీలు, కార్యాలయాలు లేని కార్పొరేషన్లు బీసీలకు ఏం ఉపయోగపడతాయో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు.

ఎన్నికలకు ముందు ఏలూరుసభలో  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన కులాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, వారిసంక్షేమానికి ఏటా రూ.15వేలకోట్ల వరకు ఖర్చుచేస్తానని చెప్పాడన్నారు. ఆ బడ్జెట్ ఏమైందో, కేటాయిస్తాన న్న రూ.15వేలు కోట్లు ఏమయ్యాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వంటి పథకాలకు ఖర్చుచేసే మొత్తాన్నికూడా బీసీలకు ఖర్చుచేస్తున్నట్లుగా  జగన్  ఆయన మంత్రులు ప్రచారం చేసుకుంటున్నారని రవీంద్ర తెలిపారు.

అందరికీ ఇచ్చినట్టే  బీసీలకు కూడా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు తప్ప, వారికి ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులుచేసి, ఎంతఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నారు.  గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లిచదువుకోవడం కోసం రూ.10 నుంచి రూ.20లక్షల వరకు ఇచ్చారన్నారు. నేడు జగన్ అధికారంలోకి వచ్చాక ఆ నిధులన్నీ ఆపేసి, విదేశాల్లోని విద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చాడన్నారు.

ఆదరణపథకం కింద టీడీపీ ప్రభుత్వం  90శాతం సబ్సిడీపై బీసీల్లోని చేతివృత్తులు, కులవృత్తుల వారికి వివిధరకాల పనిముట్లను అందచేస్తే, జగన్ వాటన్నింటిని గోదాములకే పరిమితం చేసి, బీసీలకు అందకుండా చేశాడన్నారు. బీసీలు తమవంతుగా చెల్లించిన పదిశాతం సొమ్ముని వారికి చెల్లించకుండా, వారికి  అందించాల్సిన పనిముట్లను వారికి ఇవ్వకుండా వైసీపీప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలను వేధిస్తున్నమాట నిజం కాదా అని రవీంద్ర ప్రశ్నించారు. 

గృహనిర్మాణపథకంలో ఈ ప్రభుత్వం ఎందమంది బీసీలకు రుణాలిచ్చిందో చెప్పాలన్నారు. బీసీలకు ఇవ్వాల్సిన ఇళ్లు ఇవ్వకుండా నిలిపేసి, వారికి ఇవ్వాల్సిన రుణాలు, ఆదరణ పథకాన్ని, విదేశాలకువెళ్లే విద్యార్థులకు చెల్లించాల్సిన సొమ్ముని ఆపేసిన జగన్మోహన్ రెడ్డి బీసీలనుఎలా ఉద్ధరించాడో చెబితే, వారే సంతోషిస్తారని టీడీపీనేత ఎద్దేవాచేశారు. 139 బీసీకులాలుంటే, కేవలం 56కులాలకు తూతూమంత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, వారిని ఉద్ధరించేశామంటే సరిపోదన్నారు.

ఏడాదిన్నరలో ఒక్క బీసీ ఫెడరేషన్ కు రూపాయికూడా నిధులు ఇవ్వలేదని, వాటిస్థానంలో ఏర్పాటుచేసిన కార్పొరేషన్లనుకూడా నిబంధనలకు విరుద్ధంగానే ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. కార్పొరేషన్లు వేసేశాముకాబట్టి, బీసీలంతా తమవెంటే ఉన్నారని జగన్  చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నామమాత్రపు పదవులు, జీతాలు లేని కొలువులు బీసీలకుఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, తనవర్గాన్ని మాత్రం అందలం ఎక్కించాడన్నారు. 

ఈ ప్రభుత్వం బీసీలకు ఏంచేసిందో, బీసీ మంత్రులు అనిల్ కుమార్, బొత్స సత్యనారాయణ, మరొకరైనా సమాధానం చెబితే సంతోషిస్తా మన్నారు. చీరాలలో మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టి, స్వార్థరాజకీయాల కోసం వారిని బలిచేశారన్నారు. నివర్ తుఫాను కారణంగా అనేకమంది రైతులు, ముఖ్యంగా బీసీరైతులు తీవ్రంగా నష్టపోతే, వారికి పంటలబీమాసొమ్ముకూడా అందకుండా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదన్నారు.

అడుగడుగునా బీసీలను వంచించి, వారికి ఇస్తామన్నవి ఇవ్వకుండా,  జనాభాలో 50శాతానికిపైగా ఉన్న వర్గాలకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. జగన్ నిర్వాకం కారణంగా బీసీలు తేరుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. ఇసుక కృత్రిమకొరత కారణంగా, ఉపాధి కోల్పోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలవారిని ఈ ప్రభుత్వం ఎలా ఆదుకుందో, వారికి ఏంన్యాయం చేసిందో చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు.

పనికిరాని పదవులు బీసీలకు ఇస్తే, వారి కడుపు నిండదనే నిజాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగుల్లో ఎక్కవుగా బలహీనవర్గాలవారే ఉన్నారని, వారందరికీ  జగన్ ప్రభుత్వం ఏంచేసిందన్నారు. బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం న్యాయంచేయాలని, వారికి న్యాయంగా అందాల్సిన ప్రతిఫలం అందించాలని, పాలకులు ఆ దిశగా చర్యలుతీసుకోకుంటే, టీడీపీ తరుపున బీసీలకు  మద్ధతుగా పోరాటంచేస్తామని మాజీమంత్రి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
నిధుల్లేని కార్పొరేషన్లు ఎందుకోసం జగన్ రెడ్డీ.? పంచుమర్తి అనురాధ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం పేరుతో జగన్ రెడ్డి హడావుడి చేయడం తప్ప.. బీసీలకు చేసిందేమీ లేదు. 56 కార్పొరేషన్లు తామే ఏర్పాటు చేసుకుంటున్న జగన్ రెడ్డి.. కార్పొరేషన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం ప్రభుత్వమని గుర్తుంచుకోవాలి. సొంత డబ్బాకొట్టుకోవడం మానుకోవాలి.

కుల వృత్తులపై ఆధారపడిన వారికి యాంత్రీకరణతో సాయం అందించే ఆదరణ లాంటి పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డికి కుల వృత్తుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందా.? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయీ బ్రాహ్మణులు బ్యూటీ క్లీనిక్స్ పెట్టుకునేలా, రజకులు దోబీ ఘాట్స్ పెట్టుకుని, లాండ్రీ సెంటర్లు పెట్టుకునేలా వారికి లక్షల్లో రుణాలిస్తే.. నీవు రూ.10వేలు ఇచ్చి పండగ చేసుకోమనడం వారిని అభివృద్ధి చేయడమా.?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న రిజర్వేషన్లను 24%కి కుదించి 16,800 మంది బీసీల రాజకీయ అవకాశాలాను నాశనం చేసిన జగన్ రెడ్డికి.. బీసీల రాజకీయ ప్రోత్సాహం గురించి మాట్లాడే అర్హత ఉందా.? ప్రతి కులానికి రుణాలు, స్వయం ఉపాధికి ప్రోత్సాహకాలు, విదేశీ విద్య, ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్ధాక్షిణ్యంగా రద్దు చేసిన జగన్ రెడ్డికి.. ఆయా కులాల సంక్షేమం, స్వయంవృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.

బీసీల్లోని రెండు మూడు కులాలకు రూ.10వేల చొప్పున చిల్లర విదిల్చి.. మొత్తం బీసీలనే ఉద్దరించిన మాట్లాడడం సిగ్గుచేటు. నామినేటెడ్ పదవులు, పనుల గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి.. 700కి పైగా నామినేటెడ్ పదవులు, 30 మంది సలహాదారులు, టీటీడీ బోర్డు వంటి కీలక పదవుల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారో, ఎన్ని పదవులు కేటాయించారో స్పష్టం చేసే ధైర్యం ఉందా.?

పెన్షన్లు, రేషన్, విత్తనాల కోసం ఖర్చు చేసిన సొమ్మును కూడా బీసీల కోసం చేసిన ఖర్చుగా చూపించడం దుర్మార్గం. మీలా పెన్షన్లు, బియ్యం ఉప్పూ పప్పుల లెక్కలు కూడా చెబితే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు.. నువ్వు నోరు కూడా తెరవలేవని గుర్తుంచుకో.

బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామంటున్న జగన్ రెడ్డి.. ఆయా మంత్రులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, అభివృద్ధి గురించి చర్చించే అవకాశం లేదని వాపోతున్న విషయం గురించి సమాధానం చెప్పగలరా.? రూ.5వేలు జీతం వచ్చే వాలంటీర్ పోస్టుల్ని బీసీల మొహాన కొట్టి.. లక్షల్లో వేతనాలు పొందే సలహాదార్లు, పెద్ద పెద్ద సంస్థల ఛైర్మన్లను సొంత సామాజికవర్గానికి కట్టబెట్టుకోవడంపై సమాధానం చెప్పాలి.