జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, జమిలి ఎన్నికల బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం పొందడం దాదాపు ఖాయం.
ఈ నేపథ్యంలో 2027లో ఉమ్మడి ఎన్నికలు జరుగుతాయని జోరుగా ఊహాగానాలు సాగుతుండగా.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఉమ్మడి ఎన్నికల బిల్లు ఆమోదం పొందినా.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఒకే దేశం, ఒకే ఎన్నికలు" కార్యక్రమానికి తమ పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే 2027లో ఉమ్మడి ఎన్నికలు నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారని, వారికి ఈ అంశంపై అవగాహన లేదని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ నేతలు తమ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.వైఎస్‌ఆర్‌సీపీ నేతల ప్రకటనలపై ప్రజలకు నమ్మకం పోయిందని, వారి చేష్టలు ప్రజలకు వినోదం పంచుతున్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లో విజన్‌పై చర్చలు జరగాలని చంద్రబాబు కోరారు. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిగా అభివర్ణించిన చంద్రబాబు ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.