మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (05:40 IST)

పవన్ కళ్యాణ్ బర్త్‌డే గిఫ్ట్‌గా హోదా ఇవ్వలేంకానీ.. ప్యాకేజీ ఇచ్చేద్దాం... భాజపా నేతల కసరత్తు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై మూడు దశల్లో పోరాటం చేస్తామంటూ చేసిన ప్రకటన ఇటు టీడీపీ, అటు బీజేపీ నేతల్లో చలనం రేకెత్తించింది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై మూడు దశల్లో పోరాటం చేస్తామంటూ చేసిన ప్రకటన ఇటు టీడీపీ, అటు బీజేపీ నేతల్లో చలనం రేకెత్తించింది. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేని పక్షంలో సీమాంధ్రుల పౌరుషం ఏంటో రుచి చూస్తారంటూ ఆయన హెచ్చరించారు. అదేసమయంలో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వైఖరిని తూర్పారబట్టారు. 
 
దీంతో బీజేపీ నేతలు నిద్రమేల్కొన్నారు. అలాగే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు మంచి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పవన్ మా మిత్రుడు... ఆయన్ని దూరం చేసుకోలేం. అలాగే, ప్రత్యేక హోదా అంశానికి పరిష్కార మార్గం కనుగొంటామని తనను కలిసిన పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశంపై బీజేపీ నేతలు ముమ్మరంగా చర్చిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్‌కు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చేయాల్సిన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు తదితర అన్ని అంశాలతో కలిపి రూపొందించిన ముసాయిదాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమర్పించి ఆయన సమ్మతిని తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
తగిన న్యాయ సలహా తీసుకుని సాధ్యమైనంత త్వరగా దీనిపై ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ముసాయిదాలో ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డుపడుతున్న కారణాలను పొందుపరిచినట్టు సమాచారం. ఇక చట్టబద్ధంగా వివిధ శాఖల ద్వారా మౌలిక వసతుల ఏర్పాటుకు ఇవ్వాల్సిన సాయం, రైల్వేజోన్ సహా అంశాల వారీగా ముసాయిదాలో పేర్కొంటూ ప్యాకేజీని తయారుచేసినట్టు సమాచారం. వెనకబడిన జిల్లాలకు ఇప్పటివరకు ఇస్తున్న అభివృద్ధి సాయాన్ని పెంచినట్టు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ కళ్యాణ్ పెట్టిన ఒకేఒక బహిరంగ సభతో కేంద్రంలోని కమలనాథుల్లో చలనం వచ్చిందని చెప్పొచ్చు.