గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (07:57 IST)

అమరావతిలో భారీ కట్టడాల భవిత ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భవిష్యత్తులో అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందన్న అంచనాలతో స్థిరాస్తి వ్యాపారులు, ప్రయివేటు వ్యక్తులు తాడేపల్లి-కాజ మధ్య రూ.కోట్లలో పెట్టుబడి పెట్టారు. మధ్యతరగతి వారు తాము జీవితాంతం సంపాదించిన సొమ్ముతో, అప్పులు తెచ్చి ఫ్లాట్లు కొనుక్కున్నారు.

అలా పెట్టుబడి పెట్టిన నిర్మాణ సంస్థల యజమానులు, కొనుగోలు చేసిన వారు, హోటళ్లు, వివిధ వ్యాపారాలు ప్రారంభించిన వారంతా రాజధాని మార్పు వార్తల నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో... కనకదుర్గ వారధి దాటిన తర్వాత తాడేపల్లి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు జాతీయ రహదారి వెంట 12-15 కి.మీ.ల వరకు నాలుగున్నరేళ్లలో ఒక గ్రోత్‌ కారిడార్‌(అభివృద్ధి నడవా)లా మారింది.

అమరావతి నగరం ప్రణాళికల దశలో ఉండగానే... ఇక్కడ ప్రగతి మొదలైంది. రాజధానికి అనుబంధంగా పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులతో ఇదొక ‘అంకుర ప్రాంతం’గా అభివృద్ధి చెందుతోంది. జాతీయ రహదారికి అటూఇటూ కొన్ని వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మించారు.

చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు లెక్కకు మిక్కిలి వచ్చాయి. వేల సంఖ్యలో ఫ్లాట్‌లు, వందల సంఖ్యలో విల్లాలు, వేల చ.అడుగుల వాణిజ్య ప్రాంత(కమర్షియల్‌ ప్లేస్‌) నిర్మాణాలు సాగుతున్నాయి. భూముల ధరలు అమాంతం పెరిగాయి. అధికార పార్టీ వైకాపాతోపాటు ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పార్టీల కార్యాలయాలూ అక్కడే ఉన్నాయి. డీజీపీ ఆఫీసుతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలూ కొలువుదీరాయి.

ఐటీ కంపెనీలు, ఐదారు పెద్ద హోటళ్లు, రెస్టారెంట్‌లు అనేకం వచ్చాయి. జాగ్వార్‌ వంటి ఖరీదైన కార్ల షోరూంలూ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు గృహ నిర్మాణ సామగ్రిని విక్రయించే దుకాణాలూ ఏర్పాటవుతున్నాయి.