శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:15 IST)

తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, స్కాంలపై సీఎం స్పందించరా?: వర్ల రామయ్య

రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక వ్యాపార ధృక్పథంతో పనిచేసే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

జగన్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వెలుగుచూసిన కుంభకోణాలు, అధికారుల వ్యవహరశైలి వంటి అంశాలపై పూర్తి ఆధారాలతో వర్ల రామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నడుసున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమా ...లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో తెలియడం లేదన్న ఆయన,  ఈ ప్రభుత్వం ప్రజలను అస్మదీయులు, తస్మదీయులని రెండు వర్గాలుగా విడదీసిందన్నారు.

అస్మదీయులకు అగ్రతాంబూలంఅందిస్తూ, తస్మదీయులను  మాత్రం అన్నిరకాలుగా వేధింపులకు గురిచేస్తోందన్నారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉండేవారు, జగన్ అనుమాయులు, ఆయనకు జేకొట్టే వారంతా అస్మదీయులైతే, ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రభుత్వం నడవాలి అనేవారు, పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనికోరుకునే వవారు తస్మదీయులని రామయ్య వివరించారు.

పాలనా యంత్రాంగం అస్మదీయులకే ప్రాధాన్యత ఇస్తోందని, వారు ఫిర్యాదుచేసిన వెంటనే చర్యలుతీసుకుంటోందన్నారు. పాలనాయంత్రాంగం ఇలా వ్యవహరిం చడం చాలా బాధాకరమన్న వర్ల,  మాజీ మంత్రులు  అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై వ్యవహరించినట్లుగా, తప్పులు చేస్తున్న ప్రభుత్వంలోని పెద్దలపై ఎందుకుచర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఇంటి గోడలు దూకిన 300మంది పోలీసులు, ఆయన విషయంలో ఎందుకంత అత్యుత్సాహంతో వ్యవహరించారన్నారు. 8మందిపోలీసులను కాల్పిచంపిన దూబేను కూడా అలా అరెస్ట్ చేసి ఉండరని రామయ్య వ్యాఖ్యానించారు. తస్మదీయుల మైన తాము చేసిన ఫిర్యాదులపై ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలన్నారు. 

ఈ ప్రభుత్వంలో దోసెడు ఇసుక కూడా దొరకడంలేదని, తాను ఆన్ లైన్ లో బుక్ చేసి 3 రోజులైనా ఇసుక రాలేదని అధికార పార్టీఎమ్మెల్యేలు చెప్పినా ప్రభుత్వం అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో సమాధానం చెప్పాలన్నారు. 2లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకమాయమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చెప్పినా, అందుకు ఎవరు కారణమో ఎందుకు తేల్చలేదన్నారు.

మంత్రి చేసిన ప్రకటనపై కేసు నమోదుచేసి, విచారించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై లేదా అని రామయ్య మండిపడ్డారు. ప్రజలసొమ్మును ఇసుకరూపంలో పందికొక్కుల్లా తినేస్తున్న వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదో, రీచ్ ల నుంచి స్టాక్ పాయింట్లకు వచ్చే ఇసుక మధ్యలోనే ఎలా మాయమవుతుందో, దానివెనకున్న ఇసుకాసురులు ఎవరో బయటపెట్టాలని వర్ల డిమాండ్ చేశారు.

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే ఈ విషయం చెప్పారని, మరో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తాను ఇసుక బుక్ చేసి, 3రోజులైనా తనకు రాలేదని వాపోయారని, అధికార పార్టీఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో ఇసుకకోటరీ ఏర్పడిందని చెప్పినా ప్రభుత్వంలో చలనం ఎందుకు రాలేదన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నడిరోడ్డులో నిలబెట్టి ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు.

108 వాహనాల వ్యవహరంలో రూ.307కోట్ల కుంభకోణం జరిగితే చర్యలెందుకు లేవన్న వర్ల,  తన అల్లుడి కంపెనీకి మేలుచేయడం కోసం ప్రజలసొమ్ముని దోచిపెట్టిన వైనంపై ఏ2 ఎందుకు నోరెత్తలేదన్నారు. పేదలకు పంచే ఇళ్లస్థలాల మెరక పేరుతో, చదును పేరుతో రూ.3వేలకోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆధారాలతో సహా బయటపెట్టినా జగన్ ఎందుకు స్పందించలేదన్నారు?

ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఏమిటో జగన్ కు తెలుసా అన్న వర్ల, ఆయన సలహాదారులైనా ఆయనకు అదేమిటో చెప్పాలి కదా అన్నారు.  గనులశాఖ విజిలెన్స్ ఏడీ ప్రతాపరెడ్డి రూ.3కోట్ల లంచం అడిగాడని క్వారీయజమాని చేసిన ఫిర్యాదుపై ఎందుకు విచారణ జరపలేదన్నారు. సదరు  అధికారి పీకలు కోస్తాను.. అంతుచూస్తాను... జేసీ దివాకర్ రెడ్డిని పరిగెత్తించాను.. సీఎం రమేశ్ కి చుక్కలు చూపించాను అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఈ ప్రభుత్వం అతన్ని ఎందుకు ఉపేక్షించిందన్నారు.

ఈవిధంగా తప్పుడు పనులు చేసేవారిని వదిలేస్తున్న ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని వర్ల ప్రశ్నాంచారు?  నేనుఅడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనన్న ఆయన, అలా చెప్పకపోతే సీఎం బరినుంచి పారిపోయినట్లే లెక్కన్నారు. ఆయన గానీ, బాధ్యతగల మంత్రిగానీ తాను అడిగిన ప్రశ్నలపై  స్పందించాలని, అప్పుడే ఈ ప్రభుత్వం ఎవరి పక్షమో తేలుతుందన్నారు.