బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే... ఆ అమ్మాయిని మృత్యువు కాటేసింది...
రాజమండ్రి : కాలేజీకి బస్సు మిస్ అయిందని బైక్ ఎక్కితే వ్యాన్ ఢీకొట్టడంతో ఆ అమ్మాయి ప్రాణం పోయింది. తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతోంది. అదే పట్టుదలతో డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని నిత్య
రాజమండ్రి : కాలేజీకి బస్సు మిస్ అయిందని బైక్ ఎక్కితే వ్యాన్ ఢీకొట్టడంతో ఆ అమ్మాయి ప్రాణం పోయింది. తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతోంది. అదే పట్టుదలతో డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని నిత్యం శ్రమిస్తోంది. ఎప్పటిలాగే కళాశాలకు బయలుదేరిన ఆమెకు సోమవారం బస్సు మిస్సయింది. ఆ బస్సు కోసం బైక్‌పై లిఫ్ట్ అడిగి బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలో మృత్యువు కాటేసింది.
వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా పందలపాక గ్రామానికి చెందిన జిలగం శ్రీనివాసరావు గ్రామంలో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వ్యాపారాన్ని చూసుకుంటుండగా, కుమార్తె గౌరీ దుర్గ (19) రామచంద్రపురం వీఎస్‌ఎం కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. రోజూ ఉదయం 8 గంటలకు పందలపాక నుంచి తొస్సిపూడి సెంటర్‌కు సైకిల్‌పై వచ్చి, అక్కడి నుంచి రామచంద్రపురానికి ఆర్టీసీ బస్సులో వెళుతోంది.
ఆ రోజు తొస్సిపూడి సెంటర్ వద్దకు వచ్చేసరికి అప్పుడే బస్సు బయలుదేరింది. దీంతో అటుగా బైక్‌పై వెళుతున్న తోటి విద్యార్థి ఊలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి జయేంద్ర మణికుమార్‌ను బస్సు వద్దకు తీసుకువెళ్లాలని లిఫ్ట్ అడిగింది. ఆమెను తీసుకువెళుతుండగా, కొమరిపాలెం సూర్య మోడరన్ రైస్ మిల్లు వద్ద, రాయవరం వైపు నుంచి వచ్చిన వ్యాన్ వారి బైక్‌ను ఢీకొంది.
ఈ సంఘటనలో బైక్‌పై నుంచి గౌరీదుర్గ కిందపడగా, ఆమె తల మీదుగా వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌కుమార్, బిక్కవోలు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్‌కుమార్ తెలిపారు. ఆ కుటుంబంలో డిగ్రీ చదువుతున్న ఏకైక వారసురాలు గౌరీదుర్గను ఇంటిల్లిపాది ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వ్యాపారం పనిపై విశాఖపట్నం వెళ్లిన గౌరీ దుర్గ తండ్రి, సోదరుడు ఆమె మరణవార్త విని హుటాహుటిన ఇక్కడకు బయలుదేరారు. వారితో పాటు గౌరీదుర్గ తల్లి ఆమె మరణవార్తను విని బోరుమని విలపిస్తున్నారు.