అక్షయ తృతీయపై మూఢాల ఎఫెక్ట్... తగ్గిన బంగారం సేల్స్
విజయవాడ: నేడు అక్షయ తృతీయ పండుగ ముగిసింది. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు... ఈ రోజు బంగారం కొంటే...అది మూడింతలుగా వృద్ధి చెందుతుందని నమ్మిక. అందుకే ఏటా అక్షయ తృతీయ నాడు విరివిగా బంగారు ఆభరణాలు కొంటుంటారు. కానీ, ఈ సారి అక్షయ తృతీయపై మూఢాల ప్రభావం పడింది. ఏకంగా ఆరు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడం, మరో పక్క బంగారం ధర పెరగడం, కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు వెరసి సేల్స్ తగ్గిపోయారంటున్నారు వ్యాపారులు.
విజయవాడలో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు దుకాణాల వద్ద సందడి నెలకొంది. కొద్దో గొప్పో బంగారం కొనాలని మధ్యతరగతి మహిళలు ఉవ్విళ్ళూరుతున్నారు. ముఖ్యంగా కూర్చున్న లక్షీ రూపు ఉన్న బంగారు నగలు కొనాలని సెంటిమెంట్. దీనివల్ల బంగారం మూడు రెట్లు వృద్ధి చెందుతుందని, ఇల్లంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో నిండిపోతుందని నమ్మిక. అయితే, బంగారు వర్తకులు మాత్రం ఈ సారి వ్యాపారం చాలా డల్‌గా ఉందంటున్నారు. గురు, శుక్ర మూఢమిల ప్రభావం..పడింది అంటున్నారు.
మరో ఆర్నెళ్ళ వరకూ ముహూర్తాలు లేవు... దీనివల్ల పెళ్ళిళ్ళు, శుభకార్యాలు లేవు. మరో పక్క బంగారం ధర పెరిగింది. కొనుగోళ్ళపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. 2 లక్షలు బంగారం కొన్న వారు తప్పనిసరిగా ఆధార్, ఐటిలు చూపాలంటూ విధించిన నిబంధనతో అందరూ బెంబేలుపడుతున్నారు. వీటన్నింటి వల్ల అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్ళపై ప్రభావం పడిందని చెపుతున్నారు. అయినా సెంటిమెంట్ కోసం...కొద్ది బంగారం కొంటున్నారు మహిళలు.