ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (21:51 IST)

అన్నమయ్య జిల్లాలో దారుణం.. టమోటా తోటకు కాపలావున్న రైతు హత్య

tomatos
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. టమోటా తోటకు కాపలాగా ఉన్న రైతు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి పెద్దతిప్పసముద్రం గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అనే రైతు కోతకు వచ్చిన టమోటా పంటకు కాపలా ఉండగా, దుండగులు కొందరు ఈ దురణానికి పాల్పడ్డారు. ఇదే జిల్లాలోని బోడుమల్లదిన్నె గ్రామంలో టమోటాల కోసం రైతు నరేం రాజశేఖర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెల్సిందే. ఇపుడు ఈ జిల్లాలో మరో టమోటా రైతు దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తుంది. 
 
కాగా, దేశ వ్యాప్తంగా టమోటా ధరలు ట్రిబుల్ సెంచరీని దాటిపోయాయి. పలు ప్రాంతాల్లో కేజీ టమోటాలు రూ.300 నుంచి రూ.400 మేరకు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది టమోటా రైతులు పంట చేలల్లో కాపలాగా ఉంటున్నారు. అనేక మంది రైతులు పంట పొలాల్లోనే నిద్రిస్తున్నారు. మధుకర్ రెడ్డి కూడా ఇదేవిధంగా పంట పొలంలో నిద్రించగా, దండుగులు ఆయనపై దాడి చేసి చంపేశారు. సోమవారం ఉదయం పంట పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అతని శవాన్ని చూసి హతాశులయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
టమోటా సాగుతో నెల రోజుల్లో కోటీశ్వరుడుగా మారిన రైతు  
 
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ధరలతో జనం గగ్గోలు పెడుతుంటే టమోటా రైతులు మాత్రం తెగ సంతోష పడిపోతున్నారు. తాజాగా పెరిగిన ధరల పుణ్యమాని కొందరు రైతులు ఏకంగా కోటీశ్వరులై పోయారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వారు ధనవంతులుగా మారిపోయారు. సాధారణంగా వ్యవసాయంలో కోట్లాది రూపాయలు అర్జించడం అనేది చాలా అరుదు. కానీ, దేశ వ్యాప్తంగా పెరిగిన కూరగాయల ధరల కారణంగా నెల రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. 
 
వీరిలో ఒకరు మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్‌. ఈయన 12 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో విక్రయించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.
 
అదేవిధంగా మరో రైతు పేరు అరుణ్ సాహూ. ఛత్తీస్‌గఢ్‌ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్‌ గ్రామ రైతు. ఈయన 150 ఎకరాల్లో టమోటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. రూ.కోటికి పైగా ఈ నెల కాలంలోనే సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి రాణిస్తున్నారు.