బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 8 నవంబరు 2017 (21:56 IST)

అలా చేస్తే వారు హర్ట్ అవుతారు... జాగ్రత్తగా చూస్కోవాలి... స్పీకర్ డాక్టర్ కోడెల

అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పర్యవేక్షించాలని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాసనసభా ప్రాంగణం సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పో

అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పర్యవేక్షించాలని  శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాసనసభా ప్రాంగణం సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పోలీస్ ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ జరిగే సమయంలో పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని చెప్పారు. మీడియాకు సంబంధించి కొద్దిమందికి మాత్రమే పాస్‌లు ఇస్తామని, మిగిలిన వారిని లోపలకు అనుమతించవద్దన్నారు. 
 
అందరికీ కొత్తగా పాస్‌లు జారీ చేస్తారని తెలిపారు. శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను గుర్తించడానికి ప్రధాన ద్వారం వద్ద పోలీసులతోపాటు శాసనసభ సిబ్బందిని కూడా ఒకరిని నియమిస్తామని చెప్పారు. వారిని గుర్తించలేక అడ్డుకుంటే వారు ‘హర్ట్’ అవుతారని, అందువల్ల సభ్యులకు గౌరవభంగం కలుగకుండా వ్యవహరించాలన్నారు. వీఐపీలు, సాధారణ విజిటర్లు వచ్చినప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పారు. పోయినసారి శాసనసభలో పైఅంతస్తు నుంచి ఎవరో ఒకరు పేపర్ విసిరేశారని, అలా జరుగకుండా జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించాలన్నారు.
 
సమావేశాల సందర్భంగా వెయ్యి మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. శాసనసభ వద్దకు రావడానికి ఆరు మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాల్లో చెక్ పాయింట్లు గుర్తించి అక్కడ 400 మందిని నియమిస్తున్నట్లు, అలాగే మహిళా ఫోర్స్‌ని కూడా నియమిస్తున్నట్లు వివరించారు. విజిటర్స్ ఒక్కసారిగా గుంపుగా రాకుండా వారికి కొద్దిమంది తరువాత కొద్దిమందికి  సమయం కేటాయించాలని కోరారు. పోలీస్ ఉన్నతాధికారులకు ఒక కేబిన్ కేటాయించాలని కోరారు. 
 
గతంలో సిబ్బంది టాయిలెట్లు సరిపోక ఇబ్బందిపడినట్లు తెలిపారు. అందుకు స్పీకర్ స్పందించి ఒక కేబిన్ కేటాయిస్తామని,  మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఈ నెల 16న సీపీఐ వారు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఆ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో శాసనమండలి ఇన్ చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, అడిషనల్ డీసీపీ హరీష్ కె గుప్తా, ఇతర ఉన్నతాధికారులు జె.సత్యనారాయణ, ఎస్.శంతల్ కుమార్, సీహెచ్ విజయా రావు, వెంకట అప్పల నాయుడు, విక్రాంత్ పాటిల్, పి.శ్రీనివాస్, జీ.రామాంజనేయులు, ఎన్. వెంకటరెడ్డి, వి.సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.