మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు, వారిపైన దర్యాప్తు చేయాలి అంటూ గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించటంతో ఒక్కసారిగా అందరికీ న్యాయపరమైన ఆసక్తి నెలకొంది.
సహజంగా మొన్నటి వరకు పోలీసుల తీరుపైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చేది. అయితే మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై ఈ రోజు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయటం, విచారణాకు ఆదేశించటం సరి కొత్త పరిణామం.
టిడిపి నేతను బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి, పోలీసులు తనని కొట్టారు అంటూ మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ముందు చెప్పుకున్నారు. ఆ గాయాలు కూడా కోర్టుకు చూపించారు. అతని స్టేట్మెంట్ అయితే మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ రికార్డ్ చేసారు కానీ, అతన్ని వైద్య పరీక్షలకు పంపకుండా, విడుదల చేయకుండా, రిమాండ్ వేయటంపై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బ్రహ్మం చౌదరి హైకోర్టుకు వెళ్ళారు. ఇక ఇదే సమయంలో బ్రహ్మం చౌదరికి, 41 ఏ నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసారని, తన పైన పెట్టిన కేసులు అన్నీ, ఏడేళ్ళ లోపు కేసులు అని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నోటీస్ ఇవ్వాల్సి ఉందని, కోర్ట్ కు తెలిపారు.
నోటీస్ ఇచ్చి, విచారణ చేసి పంపించి వేయాలని, ఒక వేళ నోటీస్ ఇచ్చిన తరువాత అరెస్ట్ చేయాలి అంటే, మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, అవేమీ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటమే కాకుండా, కస్టడీలో కొట్టారు అంటూ బ్రహ్మం చౌదరి హైకోర్టుకు తెలిపారు. దీని పై హైకోర్టు స్పందిస్తూ, మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ కు ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది.
దెబ్బలు తగిలయని చెప్తే, వైద్య పరీక్షలకు ఎందుకు పంపించలేదని హైకోర్టు ప్రశ్నించింది? 41 ఏ నోటీస్ విషయంపై కూడా ప్రశ్నించింది. ఇవన్నీ రికార్డులో రాసి కూడా, రిమాండ్ కు ఎందుకు తరలించాల్సి వచ్చిందో కోర్టుకు చెప్పాలని తెలిపింది. దీనిపై వివరణ కోరింది. కోర్టు ఆదేశాలు ప్రకారం మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఈ రోజు వివరణ ఇవ్వగా, కోర్టు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. గుంటూరు జడ్జిని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు కింద కోర్టు మెజిస్ట్రేట్ లు అందరూ, రొటీన్ గా రిమాండ్ వేయటం కాకుండా, కేసు మెరిట్స్ ప్రకారం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.