1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Home Minister Review on Arnab Cyclone

అర్నాబ్‌తో పెను ముప్పు పొంచివుంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోం మంత్రి అనిత

vangalapudi anitha
అర్నాబ్ తుపానుతో పెను ముప్పు పొంచివుందని, అందువల్ల రాష్ట్ర యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి అనిత కోరారు. రానున్న ఐదు రోజులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం నుంచి విస్తారంగా.. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 
 
ఈ అర్నాబ్ తుపాను బుధవారం బాపట్ల - విశాఖ తీరాల మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయని.. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 
 
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బీచ్‌లలోకి పర్యాటకులను అనుమతించవద్దన్నారు. భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్‌ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని మంత్రి అనిత కోరారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మద్యం మత్తులో కానిస్టేబుల్ చేతివేళ్ళు కొరికిన ర్యాపిడో డ్రైవర్