శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (09:38 IST)

నిషిత్ కారు ప్రమాదం: ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలాయి?... బెంజ్ ప్రతినిధులు ఏమంటున్నారు?

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృత్యువాతపడగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై అటు పోలీసులతో పాటు అటు బెంజ్ కంపెనీ ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృత్యువాతపడగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై అటు పోలీసులతో పాటు అటు బెంజ్ కంపెనీ ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నిషిత్ కారు ప్రమాదానికి గురైనపుడు ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని పగిలిపోయాయి. ఇలాఎందుకు పగిలాయన్న అంశంపై బెంజ్ ప్రతినిధులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా, ఈ ఘటనపై జర్మనీలోని మెర్సిడెస్‌ బెంజ్‌ కంపెనీకి పోలీసులు లేఖ రాశారు. కారులోని సాంకేతిక లోపాలపై సందేహాలను లేఖలో వ్యక్తపరిచారు. 
 
అంతేకాకుండా, ఈ నేపథ్యంలో వాస్తవాలను గుర్తించేందుకు మెర్సిడెస్‌ బెంజ్‌ కంపెనీ ప్రతినిధుల బృందం గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని ప్రమాదస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించింది. తర్వాత బోయినపల్లిలోని బెంజ్‌ కంపెనీలో ప్రమాదానికి గురైన కారును అధికారులు పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 210కి లోమీటర్ల వేగంతో నడిపినట్లు స్పీడోమీటర్‌ ఆధారంగా పోలీసులు గుర్తించిన విషయం తెల్సిందే. 
 
ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జు కావటం ఆ కంపెనీ నిపుణులనూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జపాన్‌, హాంకాంగ్‌, ఢిల్లీ, పుణెకు చెందిన బెంజ్‌ కార్ల నిపుణులు, ఓ లీగల్‌ అడ్వైజర్‌తో కూడిన 10 మంది సభ్యుల బృందం గురువారం జూబ్లీహిల్స్‌లోని మెట్రోపిల్లర్‌ను పరిశీలించింది. కారు ప్రయాణించిన మార్గాన్ని వారు పరిశీలించారు. ట్రాఫిక్‌లో కూడా అంత వేగం ఎలా సాధ్యపడిందని వారు ప్రశ్నించారు. 
 
మెట్రోపిల్లర్‌ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు. ప్రమాద జరిగాక కారు పరిస్థితిపై ఆరా తీశారు. బెలూన్‌లు, బ్రేకుల పరిస్థితిని పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు అంచనాకు వచ్చారు. తర్వాత బోయిన్‌పల్లిలోని బెంజ్‌ షోరూంకు వెళ్లారు. అక్కడ కంపెనీ మెకానిక్‌లతో కొద్దిసేపు మాట్లాడినట్లు సమాచారం. 
 
కాగా గంటకు 80-120 కిలోమీటర్ల వేగం మధ్యలో ప్రమాదం జరిగినట్లయితే ప్రాణాలతో బయటపడేవారనే అభిప్రాయాన్ని కంపెనీ బృందం వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిస్టం, ఎయిర్‌బ్యాగ్స్‌, సీటు బెల్టు పనితీరు బాగానే ఉందని.. మితిమీరిన వేగం వల్లనే భద్రతాపరమైన సౌకర్యాలు కూడా కాపాడలేకపోయాయంటూ నిపుణుల బృందం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం మరోసారి ఘటనాస్థలాన్ని, వాహనాన్ని పరిశీలించి శని, ఆదివారాల్లో పోలీసు అధికారులు లేఖలో పేర్కొన్న అంశాలపై నివేదిక ఇవ్వవచ్చని సమాచారం.