శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (04:12 IST)

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్ జె.డి.లక్ష్మీనారాయణకు ఓనమాలు కూడా తెలియవా?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్‌ కేసు విచారణ జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోఉమ్మడి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పి. రమాకాంత్ రెడ్డి సీబీఐ సత్యసంధతను, నేర విచారణ తీరులోని అసంబద్ధతను కడిగిపారేస్తూ సంచలనాత్మక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్‌ కేసు విచారణ జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ పెట్టిన కేసు నిలవదని ఆరోజే చెప్పానని, నేర విచారణ తీరుపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను అక్రమాస్తుల కేసు విచారణ ప్రక్రియపై ఆనాడే సవాలు చేశానని రమాకాంత్ రెడ్డి చెబుతున్నారు. జగన్‌పై కేసులు పెట్టి విచారించిన సీబీఐకి రాష్ట్రంలో సెక్రటేరియెట్‌ రూల్స్, పద్ధతులు ఏమాత్రం తెలియవని కేబినెట్‌ సమావేశం అంటే ఏమిటి ఏ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారు.. ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం.. కేబినెట్‌ పరిధి ఏమిటి.. ముఖ్యమంత్రికి గల అధికారాలేమిటి కేబినెట్‌లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు సీబీఐకి నిజంగా తెలియదని, ఎలాంటి అవగాహన లేకుండానే అటు రాజకీయ నేతలపై, ఇటు ఐఏఎస్ అధికారులపై కేసులుమీద కేసులు పెట్టుకుంటూ పోయారని తుది విచారణలో వీటిలో ఏ ఒక్కటి నిలబడే కేసులు కావని రమాకాంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒక ప్రముఖ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో రమాకాంత్ రెడ్డి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే విందాం..
 
 
ఫలానా ఆఫీసును రెయిడ్‌ చేయాలని హైకోర్టు చెబుతుందా?
జగన్‌పై కేసులు పెట్టినప్పుడు సీబీఐ వాళ్లు నన్ను రెండుసార్లు దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు పిలిచారు. అప్పుడు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా లక్ష్మీనారాయణ ఉండేవారు. ‘మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నన్ను పిలిపించారు, సంతోషం. అయితే, ఫలానా వ్యక్తులను కూడా మీరు పిలిపించి మాట్లాడుతారా’ అని ఆయనను అడిగితే, ‘నేను పిలవడం లేదండి. వారిని ప్రశ్నించడానికి హైకోర్టు నాకు అంతటి పరిధి విధించలేదు’ అని జవాబిచ్చారు. ‘మీరు ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌. ఫలానా వాళ్లను ఇంటరాగేట్‌ చేయొచ్చు. ఫలానా వాళ్లను ప్రశ్నలు అడగొచ్చు. ఫలానా వాళ్ల ఇళ్లు, ఆఫీసులను రెయిడ్‌ చేసినా, అక్కడి నుంచి కాగితాలు తెచ్చుకోవచ్చు. ఫలానా ఆఫీసును రెయిడ్‌ చేయాలని హైకోర్టు చెబుతుందా’ అని అడిగాను. దానికి ఆయన, ‘అబ్బో వద్దండి... అదంతా కదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది’ అన్నారు. ‘అలాగైతే మీ ఇన్వెస్టిగేషన్‌ మీద నాకు నమ్మకం లేదండి’ అన్నాను. ‘నేను ఈ మాట చెబుతున్నాను, ఇది రికార్డు అవుతుందని నాకు తెలుసు’ అని చెప్పాను.  
 
సీబీఐకి కనీసం సెక్రటేరియట్‌ రూల్స్‌ కూడా తెలియవు...  
కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌ గురించి ప్రశ్నించడానికి లక్ష్మీనారాయణ నన్ను దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్‌ వచ్చినప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో సెక్రటేరియెట్‌ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్‌. కేబినెట్‌ సమావేశం అంటే ఏమిటి ఏ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారు.. ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం.. కేబినెట్‌ పరిధి ఏమిటి.. ముఖ్యమంత్రికి గల అధికారాలేమిటి కేబినెట్‌లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు సీబీఐకి నిజంగా తెలియదు.
 
వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కాని రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. అవి తెలియజెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎలా పని చేస్తుందో సీబీఐకి తెలియజెప్పే పనిని సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో పనిచేసే ఓ మహిళా అధికారికి అప్పగించాం. ఆమె ఆ పని చేశారు. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు స్టేట్‌ గవర్నమెంట్‌ రూల్స్, ప్రొసీజర్స్‌ను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు. నేను ఆరోజే ఆయన (లక్ష్మీనారాయణ)ను ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా.. అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన అంటూ రమాకాంత్ రెడ్డి తెలిపారు.
 
దాదాపు ఆరేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వం తరపున కేసులు పెట్టి అక్రమాస్తుల కేసుపై నెలల తరబడి విచారణ చేసిన నాటి సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ విచారణతీరుపై, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై, సచివాలయ నిబంధనలు, పద్ధతులపై ఆయన అవగాహనా లేమి గురించి నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి.