సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (09:43 IST)

రోజా - భూమనకు సీఎం జగన్ ఎందుకు మొండిచేయి చూపారు?

ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మొత్తం 25 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పార్టీకి విశిష్ట సేవలు అందించినవారికి, విధేయతకు పెద్దపీట వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... చిత్తూరు జిల్లాలోని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. పైగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై చర్చనీయాంశంగా మారింది. 
 
భూమన కరుణాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. దివంగత వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ సీఎం కాగానే తుడా ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఆ తర్వాత తితిదే బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌ ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో జగన్‌ సైతం ఆయనకే టికెట్‌ ఇచ్చారు. తర్వాత ఆయన వైఎస్‌ కుటుంబంతో బంధుత్వం కూడా కలుపుకున్నారు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే కరుణాకర రెడ్డికి అమిత ప్రాధాన్యత వుంటుందని రాజకీయవర్గాలు భావించాయి. 
 
అలాగే, నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే. రోజా విషయానికి వస్తే వైసీపీకి రాష్ట్రస్థాయిలో అనధికార ప్రతినిధిగా వ్యవహరించారు. పార్టీ గళాన్ని బలంగా వినిపించారు. అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఫలితంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. నగరిలో వరుస ఎన్నికల్లో ముఖ్యనేత ముద్దుకృష్ణమనాయుడు, ఆయన తనయుడు భానుప్రకాష్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో ఈమెకు కూడా జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, భూమనతో పాటు.. ఆర్కే రోజాకు జగన్ షాకిచ్చారు. శుక్రవారం రాత్రి ప్రకటించిన కొత్త మంత్రుల జాబితాలో వారిద్దరి పేర్లు లేకపోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీరికి మరో రెండున్నరేళ్ళ తర్వాత తన మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా? పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తారా? అనే అంశంపై ఇపుడు తీవ్ర చర్చ సాగుతోంది. మరోవైపు, జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి), ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), అనంత వెంకట్రామరెడ్డి (అనంతపురం రూరల్) వారికి కూడా చోటు కల్పించక పోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.