తండ్రిని చంపి.. శవాన్ని ముక్కలు చేసి బక్కెట్లలో దాచిన తనయుడు
మద్యానికి బానిసైన తనయుడు కిరాతకుడిగా మారిపోయాడు. తొలుత కన్నతండ్రిని హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను ప్లాస్టిక్ బక్కెట్లు, బిందెలలో నిల్వచేసి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన మృతుని భార్య, కుమార్తె కూడా కిరాతక కొడుక్కు భయపడి బయటకు చెప్పలేదు. అయితే, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని డాక్టర్ ఎన్ఏ కృష్ణానగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, సుతార్ మారుతి అనే వ్యక్తి సౌత్‌సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో గూడ్స్‌రైల్ డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయనకు గయ, కొడుకు సూతార్ కిషన్(30), కూతురు ప్రపూల్‌లు ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర నుంచి 15 యేళ్ళ క్రితం వచ్చి మౌలాలి ఆర్టీసీ కాలనీలోని డాక్టర్ ఎన్‌ఏ కృష్ణనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ నెల 16వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో కొడుకు కిషన్ మద్యం తాగివచ్చి తండ్రి మారుతితో గొడవపడ్డాడు. ఈ గొడవలో తండ్రిని అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 6 నుంచి 7 ప్లాస్టిక్ బకెట్లలో నింపి దాచి ఉంచాడు. అనంతరం నిందితుడు కిషన్ పారిపోయాడు.
అయితే, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్యాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఇల్లంతా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. హత్య జరిగిన సమయంలో తల్లి, కూతురు ఇంట్లోనే ఉన్నారని, కొడుకు కిషన్ భయానికే పోలీసులకు విషయాన్ని చెప్పలేదని తల్లి గయ, కూతురు ప్రపూల్ తెలిపారని ఏసీపీ సందీప్‌రావు వెల్లడించారు.