పర్యాటక రంగంలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్... నెలకు రూ. 7000
అమరావతి : రాష్ట్ర పర్యాటక శాఖ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనా వ్యవహారాలు ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆకాంక్షల మేరకు పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష
అమరావతి : రాష్ట్ర పర్యాటక శాఖ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనా వ్యవహారాలు ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆకాంక్షల మేరకు పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ నిర్ణయం తీసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ డిగ్రీ, పిజి విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా 30కి తగ్గకుండా విద్యార్ధులకు పర్యాటక రంగంలోని వివిధ విభాగాలలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. మొత్తం విద్యార్ధుల సంఖ్యలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్ధులకు రిజర్వ్ చేయగా, మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాల విధ్యార్ధులకు కేటాయిస్తారు. డిగ్రీ స్థాయి విద్యార్ధులకు వారి విద్యాసంవత్సరంలో ఆరు నెలల కాలాన్ని ఇంటర్న్‌షిప్ కోసం వినియోగించుకునేలా కార్యాచరణ సిద్దం చేసారు. అదేక్రమంలో పిజి విద్యార్థులు రెండు నెలల సమయాన్ని దీని కోసం వినియోగించుకోగలిగే అవకాశం లభిస్తుంది.
ప్రాధమికంగా నిర్ణయించిన దానిని అనుసరించి వీరికి నెలకు రూ. 5000 నుండి రూ. 7000 వరకు వేతనం సైతం అందుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ విద్యార్ధుల ఇంటర్న్‌షిప్ వల్ల సరికొత్త ఆలోచనలకు వేదిక ఏర్పడుతుందన్నారు. యువరక్తం ఆలోచనలకు అధికార గణం ఆనుభవాలు తోడైతే మరింత పరిపక్వమైన విధానాలను రూపొందించగలుగుతామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ప్రధానంగా పర్యాటక రంగంలో కొత్తదనం అవసరం ఎంతైనా ఉందని అది నేటి యువత నుండి స్వీకరించగలుగుతామని వివరించారు.
ఈ విధానం పరోక్షంగా పర్యాటకరంగంలో ఉత్పాదకత పెంపుకు ఉపకరిస్తుందన్నారు. విద్యార్ధులలో ఆలోచనలకు కొదవ లేదని, వాటిని ఆచరణీయ విధానాలుగా మార్చటం ద్వారా పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించగలుగుతామని మీనా వెల్లడించారు. మరోవైపు ఇంటర్న్‌షిప్ కాలంలో వారికి అందించే వేతనం కనిష్టమే అయినప్పటికీ వారి నుండి లభించే సేవలు విలువైనవిగా ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ బ్రాండింగ్ సైతం బలపడుతుందని, జాతీయ స్ధాయిలో భవిష్యత్తు తరాలకు రాష్ట్ర పర్యాటక రంగం గురించిన అవగాహన పెంపొందుతుందన్నారు. ఈ తరహా విధానాన్ని తాము ఒక సామాజిక అవసరంగా కూడా భావిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. వివిధ విద్యాసంస్థలలో ఏర్పాటు చేయతలపెట్టిన పర్యాటక సొసైటీల వ్యవస్థకు, ఇంటర్న్‌షిప్ విధానానికి సంబంధం లేదని దేనికదే ప్రత్యేకతలను కలిగి ఉంటాయన్నారు.