1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:44 IST)

తెలుగుదేశంతో జనసేన పొత్తు?

రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకత్వం ఉమ్మడి అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో చాలా చోట్ల జనసేన, టిడిపి కలిసి వ్యవహరించాయి. పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నచోట్ల తెలుగుదేశం, జనసేన ప్రభావం చూపించాయి.

గత ఎన్నికల్లోనూ జనసేన ఓట్లు చీలిపోవడంతో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యిందనే అభిప్రాయంతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. బిజెపితో కలిసి వెళ్లడం ద్వారా ఉపయోగం లేకపోగా దళిత, మైనార్టీ యువత పార్టీకి దూరమయ్యారనే అభిప్రాయం జనసేన నాయకుల్లో ఉంది.

జనసేనలో కొంతమంది తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకిస్తున్నా ఇప్పుడును రాజకీయ పరిస్థితుల్లో తప్పదని ఒప్పిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస కేసులు, సంబంధం లేనివ్యక్తుల పైనా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసులు సర్వసాధారణంగా మోపేస్తున్నారని దీన్ని అడ్డుకోవాలని టిడిపి భావిస్తోంది.

చంద్రబాబు ఇంటిపైకి వైసిపి నాయకులు దాడికి వెళ్లడాన్ని జనసేన కూడా తీవ్రంగా ఖండించింది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్‌కల్యాణ్‌ను టార్గెట్‌ చేసుకుని వైసిపి నాయకత్వం విమర్శలు చేస్తుండటంతో ఒంటరిగా ఎదుర్కోలేమనే అభిప్రాయానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ వచ్చినట్లు తెలిసింది.

ఇప్పటి వరకూ తెలుగుదేశం నాయకత్వం మొత్తాన్ని కేసుల్లో ఇరికించారని, గతకొద్దికాలంగా జనసేన నాయకత్వాన్ని టార్గెట్‌ చేశారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఉమ్మడి కార్యాచరణ ద్వారా రంగంలోకి దిగాలని అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలిసి వెళ్లడం ద్వారా జనసేన కంటే బిజెపికే ఎక్కువ లాభం జరుగుతోందని, అదే సమయంలో బిజెపి నాయకత్వం జనసేనను అసలు పట్టించుకోవడం లేదనే దు:ఖం కొందరు జనసేన నాయకుల్లో ఉంది.

ఇటీవల జనసేన, టిడిపి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసి బిజెపి కేంద్ర నాయకత్వం పవన్‌కల్యాణ్‌ను ఢిల్లీ పిలిపించుకుని బిజెపితో కలిసి పనిచేయాలని, తగు న్యాయం చేస్తామని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

పవన్‌ కల్యాణ్‌ బిజెపితో తెగదెంపులు చేసుకుంటారని కొందరు చెబుతుంటే అలాంటిదేం లేదు వైసిపికి వ్యతిరేకంగా ఉండడం వరకే టిడిపితో కలుస్తారనీ, బిజెపితో దూరం కారని ఇంకొందరంటున్నారు.